జగన్ ప్రభుత్వం గజదొంగలు కూడా ఆశ్చర్యపోయేలా ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాటతప్పారని విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారాలు విధించి సంపన్నవర్గాల ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.మూడేళ్ళలోనే వైసీపీ ప్రభుత్వం అసాధారణంగా 42,172 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే కరోనా కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న చంద్రబాబు.. పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను, చెత్తపన్ను, ఇసుక, సిమెంటు, మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో మరింత ఆర్థికంగా కుంగిపోయారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం అటువంటి చర్యలు చేపట్టకపోగా విద్యుత్ చార్జీలను మరోసారి పెంచడం దారుణమని మండిపడ్డారు. 400యూనిట్ల పైన విద్యుత్ వినియోగించే సంపన్న వర్గాలపై 6శాతమే చార్జీలు పెంచి, 125యూనిట్లలోపు వాడే పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలపై 57శాతం పెంచడమే దీనికి నిదర్శనమన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మధ్య విద్యుత్ చార్జీలు పెంచేది లేదని సగర్వంగా ప్రకటించిందని.. ఆ సమయంలో 10వేల మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిందని గుర్తు చేశారు.ఇక ఐదేళ్ల టిడిపి పాలనలో కరెంటు కోతలు ఎత్తివేసి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిందని ఆయన తెలిపారు. వ్యవసాయ మోటార్లకు 9గంటల పాటు కోతల్లేకుండా కరెంటు ఇచ్చిందని పేర్కొన్నారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం దూరదృష్టితో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేస్తే.. నేడు జగన్ పక్షపాత ధోరణితో వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారని అన్నారు.
ఇక ఐదేళ్ల తమ ప్రభుత్వ పాలనలో 3.26 లక్షల అదనపు వ్యవసాయ కనెక్షన్లు ఇస్తే, జగన్ మూడేళ్లలో కేవలం 1.17 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు.అదేసమయంలో జగన్ అధికారంలోకి వచ్చాక సౌర, పవన విద్యుత్ రంగాన్నిదెబ్బతీశారని, పీపీఏలు రద్దుచేశారని తెలిపారు.మూడేళ్ళలో జగన్ ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచడంతో సామాన్య ప్రజలు ఇళ్లల్లో స్విచ్ వేయాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. విద్యుత్ చార్జీలు పెంచుతూ, పన్నులు వేస్తూ జగన్రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.
Must Read:-ఫేక్ సీఎం పేరును సార్థకం చేసుకున్న జగన్రెడ్డి : నారా లోకేష్