పీసీసీ చీఫ్, తన సోదరి షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి వివాహానికి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ను ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సొంత మేనకోడలి పెళ్లికి ఇల్లు ఇచ్చేందుకు మనసొప్పని జగన్ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే ఈ వ్యవహారాన్ని కప్పి పుచ్చేందుకు వైసీపీ నేతలు కుంటి సాకులు చెబుతున్నారు.
యలహంక ప్రాంగణంలో జగన్, షర్మిల ఇద్దరికీ వేర్వేరు భవనాలు ఉన్నప్పటికీ, రెండింటికీ ప్రవేశ ద్వారం ఒకటేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వివాహ వేడుకకు వేలాది మంది అపరిచిత వ్యక్తులు, విఐపీలు వస్తారని, దానివల్ల మాజీ సీఎం జగన్ భద్రతకు ముప్పు ఉంటుందని చెబుతున్నారు. ప్యాలెస్ లోపలి భాగాలు, ప్రాంగణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే ప్రైవసీ దెబ్బతింటుందని డ్యామేజ్‌ను కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.
ఐతే అసలు కారణం వేరే ఉందనే చర్చ నడుస్తోంది. బెంగళూరు యలహంకలో ఉన్న ఈ భవనం ఎంతో విలాసవంతంగా, వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వివాహ వేడుక పేరిట వేలాది మంది అతిథులు, రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులు అక్కడికి వస్తే..ఆ ప్యాలెస్ అంతర్గత దృశ్యాలు, విలాసాలు లైమ్‌లైట్‌లోకి వస్తాయని జగన్ భయపడుతున్నట్లు సమాచారం.
మరోవైపు, గత కొంతకాలంగా వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకాలపై వివాదం నడుస్తోంది. తల్లి విజయమ్మ స్వయంగా కలగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది. ప్రజల్లో సామాన్యుడిగా కనిపించేందుకు ప్రయత్నించే జగన్‌కు, ఈ మహల్ తరహా యలహంక భవనాలు బహిర్గతమైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ముందుజాగ్రత్తతోనే ఈ పెళ్లి వేడుకకు జగన్ నో చెప్పారనే చర్చ జోరుగా సాగుతోంది.











