విశాఖపట్నం జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. వైసీపీలో అగ్రనేతగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీని తాడేపల్లి పిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం క్లాస్ పీకారు. విశాఖ జిల్లాలో భూముల ఎన్వోసీ విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరించాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డీఆర్సీ సమావేశంలో ఆదేశించారు.
కొందరు నాయకులు తన పేరు ఉపయోగించుకుని భూముల ఎన్వోసీ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మశ్రీవైపు చూడటంతో వివాదం రాజుకుంది. అప్పటికే తన తండ్రి పేరుపై విశాఖ సమీపంలో ఉన్న ఎకరం భూమి విషయంలో కలెక్టర్ చుట్టూ తిరిగినా ఎన్వోసీ రాకపోవడంతో ఎమ్మెల్యే ధర్మశ్రీకి కోపం కట్టలు తెంచుకుంది.
దీంతో విజయసాయిరెడ్డికి అక్కడే కౌంటర్ ఇచ్చారు. తనకు ఉన్న ఎకరం భూమి తన తండ్రి నుంచి సంక్రమించిందని దానికి కూడా అధికారులు ఎన్వోసీలు ఇవ్వడం లేదని విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. దీంతో ఏమి జరుగుతుందో అర్థం కాక సాయిరెడ్డి బిక్కమొహం వేశారు. నేను ఎమ్మెల్యేలను ఉద్దేశించి అనలేదని విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చినా ధర్మశ్రీ తగ్గలేదు. ఎక్కడ నుంచో వచ్చి ఉత్తరాంధ్రలో కొందరు పెత్తనం చేస్తున్నారనడంతో ఇక వివాదం పతాక స్థాయికి చేరింది. దీంతో డీఆర్సీ సమావేశం కాస్తా వైసీపీ ముఠాకుమ్ములాటల సమావేశంలా మారింది.
నిధులు దుర్వినియోగం అవుతున్నాయి
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తుంటే కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ డీఆర్సీ సమావేశంలోనే అసహనం వ్యక్తం చేశారు. దీంతో విజయసాయిరెడ్డికి మరోసారి గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టయింది. అప్పటికి వివాదం సద్దుమణిగినా ఉత్తరాంధ్ర వైసీపీలో ముఠాల సెగలు బయటపడ్డాయి. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ముగ్గురినీ ఇవాళ తాడేపల్లి పిలిపించి క్లాస్ తీసుకున్నారు.
పబ్లిక్ గా కొట్టుకోవద్దు
విశాఖ డీఆర్సీ సమావేశంలో బయటపడ్డ వైసీపీ నేతల మధ్య వివాదాలు తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసుకు చేరాయి.పార్టీలో ఇలాంటి వ్యవహారాలు మంచిది కాదని సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే విశాఖ ఇంచార్జ్ మంత్రి కన్నబాబు తో సీఎం జగన్మోహన్ రెడ్డి రచ్చ వ్యవహారం చర్చించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి సారి వైసీపీ లో ఈ రకమైన పరిణామాలు చోటుచేసుకోవడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. అందరినీ కలుపుకొని వెళ్లాలని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి హితబోధ చేశారని సమాచారం.











