పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో కోత తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని చంద్రబాబునాయుడు రూ.55 వేల కోట్లకు పెంచి ఏటీఎంలా వాడుకుంటున్నాడని పదేపదే విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా కేంద్రంలోని సంబంధిత శాఖలకు లేఖలు రాశారు. పోలవరం నిర్మాణానికి 2014 అంచనాల ప్రకారం 20 వేల కోట్లు సరిపోతాయని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలే నేడు వైసీపీ ప్రభుత్వ మెడకు చుట్టుకున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కింద రూ.35 వేల కోట్లతో కలపి మొత్తం పోలవరం అంచనా వ్యయాన్ని రూ. 55 వేల కోట్లుగా కేంద్రం అంగీకరించాలని కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో వైసీపీ అధినేత రాసిన లేఖలను పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది.
ఈ వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కీలకంగా వ్యవహరించారని వైసీపీ అధినేత భావిస్తున్నారట. అందుకే ఆమెపై ఎలాగైనా బురద చల్లాలనే ప్రయత్నానికి తెరలేపినట్టు కనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి వద్ద పనిచేసి, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సుభాష్ చంద్ర గార్గ్ ను ఏపీ ఆర్థిక శాఖ సలహాదారుగా కీలక పదవిలో నియమించుకున్నారు. అతనితో కేంద్ర మంత్రిపై బురదచల్లే కార్యక్రమం ప్రారంభించారని జాతీయ మీడియా కోడై కూస్తోంది.
సుభాష్ చంద్ర గార్గ్ ఏమన్నారు?
‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మనస్తత్వం చాలా విచిత్రమైనది, ఆమెతో కలసి పనిచేయడం కష్టమని’ గార్గ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మంత్రి పదవి చేపట్టిన తొలి రోజుల్లోనే తనపై ఒక అభిప్రాయానికి వచ్చారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి వద్ద సంవత్సరం క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి గార్గ్ కు ఇప్పుడు నిర్మలా సీతారామన్ వ్యవహారశైలి గుర్తుకు రావడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.
సుభాష్ చంద్ర గార్గ్ సంచలన ఆరోపణల వెనుక పెద్ద శక్తులే పనిచేసి ఉంటాయని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కొంత అప్ సెట్ అయ్యారని ఆ కథనాల సారాంశం.
కేంద్ర మంత్రిపై బురద చల్లితే పోలవరం నిధులు వస్తాయా?
పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల వ్యవహారం ఒక్క కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల్లో ఉంటుంది అనుకుంటే భ్రమే అవుతుంది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ధృవీకరించాల్సిన అథారిటీ డీపీఆర్ 2కు పచ్చజెండా ఊపింది. దీంతో పోలవరం అంచనా వ్యయాన్ని 2014 ఖర్చుల ప్రకారం రూ.20398 కోట్లుగా నిర్ణయించారు. ఇదేదో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వల్ల ఏపీకి నష్టం వాటిల్లిందనే సంకేతాలు ఇవ్వడం, ఏపీలో పనిచేస్తున్న గార్గ్ తో ఆరోపణలు చేయించడం నష్టం కలిగించే వ్యవహారమే కాని ఏపీకి ఏ మాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎవరినీ వదలరా?
న్యాయవ్యవస్థనే తప్పుపట్టిన ఏపీ పాలకులు, ఇక కేంద్ర ఆర్థిక మంత్రిపై బురద వేయడంపై జాతీయ మీడియా పెద్ద ఎత్తున స్పందించింది. న్యాయవ్యవస్థ తీర్పులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం, దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ బహిర్గతం చేయడంపై అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ కూడా తప్పుపట్టారు. అయినా వెనక్కు తగ్గని వైసీపీ పెద్దలు తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిపై బురద చల్లడం చూస్తుంటే లాగేదాకా తెగేలా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిపై గార్గ్ తో సంచలన ఆరోపణలు చేయించి తరవాత ఏ మొహం పెట్టుకుని ఆమె వద్దకు వెళతారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా అటు న్యాయవ్యవస్థ పనితీరుని తప్పుపట్టి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించిన ఏపీ ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ పై సంచలన ఆరోపణలతో మరోసారి జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది. సలహాదారులు ఎక్కువ కావడం వల్లే ఇదంతా జరుగుతూ ఉండవచ్చని ఆ పార్టీకే చెందని ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలు నిజమేననిపిస్తోంది.