మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు కాగానే వైసీపీ శిబిరం కకావికలమైపోయింది. చోటామోటా నేతలతో పాటు ఇతర పార్టీల నేతలతో మంచి పరిచయాలు ఉన్న నేతలు చిన్నగా వైసీపీకి దూరంగా జరుగుతున్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా… తమను ఆపేదెవరంటూ అరాచకాలకు పాల్పడ్డవారు మాత్రం పారిపోయేందుకు అవకాశం లేక దిక్కులు చూస్తున్నారు. ఇక ఇప్పటికే వేలాది కోట్ల మేర అక్రమాస్తులు సంపాదించారంటూ సీబీఐ, ఈడీ కేసులు నమోదై…ఆ కేసుల కారణంగా ఏకంగా 16 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన జగన్ కు తన పరిస్థితి ఏమిటో అర్థం అయిపోయినట్లుంది. అందుకే తనను తాను ఎలాగూ రక్షించుకోలేని తన పరిస్థితిని గమనించిన జగన్… తనను రక్షించే ఆపన్న హస్తం కోసం వెదుకులాట మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పించి మరో పార్టీ కనిపించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే… గతంలో కాంగ్రెస్ పార్టీని విబేధించి, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ధిక్కరించి వేరు కుంపటి పెట్టుకున్న జగన్… ఏపీలో ఆ పార్టీని జీరోను చేశారు కదా. మరి జగన్ దగ్గరకు రాగానే ఆయనను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటుందా? అంత ఈజీగా చేర్చుకోదు కదా. మరేం చేయాలి? కాంగ్రెస్ కు వైరి వర్గంపై విరుచుకుపడాలి. అప్పుడు కాంగ్రెస్ దృష్టి తనపై పడుతుంది. ఆ తర్వాత మెల్లగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని మచ్చిక చేసుకుని ఆ పార్టీకి చేరువ కావచ్చు. ఈ తరహా వ్యూహానికే జగన్ ఇప్పుడు పదును పెడుతున్నారు. శుక్రవారం నాటి మీడియాసమావేవంలో జగన్… కాంగ్రెస్ కు వైరి వర్గంగా నిలిచి ఎన్డీఏ రథసారథి బీజేపీని జగన్ టార్గెట్ చేశారు. టీడీపీపై ఆరోపణలు గుప్పిస్తూనే… బీజేపీపై జగన్ ఘాటు విమర్శశలే చేశారు. బీజేపీతో జత కట్టిన తర్వాత టీడీపీ కూటమి సర్కారు యధేచ్ఛగా దోపిడీకి పాల్పడుతోందని జగన్ ఆరోపించారు.
ఈ ఆరోపణతో ఏపీలో జరుగుతున్న అవినీతి పాలనకు బీజేపీనే ప్రధాన ముద్దాయిగా జగన్ అభివర్ణించారు. గతంలో టీడీపీ పాలనలో అవినీతి జరిగినా.. ఇప్పుడు జరుగుతున్నంత స్థాయిలో నాడు అవినీతి జరగలేదని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనతో జత కట్టడంతో కూటమి సర్కారు ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తోందని జగతన్ ఆరోపించారు. మొత్తంగా ఈ అవినీతి పాపమంతా బీజేపీ పుణ్యమేనని జగన్ చెప్పినట్టైంది. గతంలో బీజేపీపై పెద్దగా ఆరోపణలు చేయని జగన్ తన కేసులను మాఫీ చేయించుకునే దిశగా ఆ పార్టీతో సఖ్యతగా మెలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితరులతో జగన్ మర్యాదగా మెలిగారు. అయితే ఇప్పుడు బీజేపీతో టీడీపీ జతకట్టిన దరిమిలా… బీజేపీ వద్ద తన ఆటలు చెల్లవన్న అంచనాకు వచ్చిన .జగన్… బీజేపీ వైరివర్గమైన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్ కు దగ్గరయ్యే దిశగా జగన్ అనుసరిస్తున్న వ్యూహం వర్కవుట్ అవుతుందా? … లేదంటే ఎదురు తన్నుతుందా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. కాంగ్రెస్ కు దగ్గరయ్యే క్రమంలో బీజేపీపై జగన్ మరింతగా విరుచుకుపడటం మొదలుపెడితే… అమ్రమాస్తుల కేసును కేంద్రం కదిపితే… జగన్ తిరిగి శ్రీకృష్ణ జన్మస్థానం చేరక తప్పదన్నవిశ్లేషణలు వస్తున్నాయి. అదే జరిగితే… వైసీపీ కథ కంచికేనన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా పార్టీని, పార్టీ నేతలను కాపాడుకునే విషయాన్ని జగన్ ఎప్పుడో పక్కనపెట్టేశారని, ఇప్పుడు తనను తాను రక్షించుకునేందుకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ తరహా ధోరణి పార్టీని ఏ తీరాలకు చేరుస్తుందోనని వైసీపీ కీలక నేతలు, ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.