స్థానిక సంస్థల ఎన్నికలు.. కడప జిల్లాలో వైసీపీ అసలు బలాన్ని బయటపెట్టాయి. జగన్మోహన్రెడ్డి సొంత గడ్డపైనే ఫ్యాన్ పార్టీ చతికిలపడింది. జిల్లాలో మొత్తం 8 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుంటే.. అందులో 6 చోట్ల కూటమి పార్టీలు ఏకగ్రీవంగా మేయర్ పదవులు దక్కించుకొన్నాయి. ఒక్క ఓటు పడకుండానే మెజారిటీ కౌన్సిలర్ సీట్లు కూటమి పార్టీల ఖాతాల్లో పడ్డాయి.
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోని 40 వార్డుల్లో.. 20 స్థానాల్లో కూటమి అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు గానూ 50 చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. బద్వేలు, ప్రొద్దుటూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాజంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ బీజేపీ ఖాతాలో పడగా.. మిగిలిన చోట్ల తెలుగుదేశం అభ్యర్ధులు విజయం సాధించారు.
ఆరు చోట్ల ఏకగ్రీవం కావడంతో.. పులివెందుల, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్ స్థానాలకు, కడప కార్పొరేషన్లో మేయర్ పదవులకు పోలింగ్ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తర్వాత జగన్ పులివెందులకు వెళ్తారని ప్రచారం జరిగినా.. ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్‌లకే పరిమితం అయ్యారు. పులివెందుల మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గెలిచే అవకాశం లేదని ముందే క్లారిటీ రావడంతో.. జగన్ అటు వైపు వెళ్లలేదనే టాక్ వినిపిస్తోంది.
పులివెందుల, జమ్మలమడుగు మున్సిపాలిటీలతో పాటు కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే.. కడప జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్, వైసీపీ వాష్ ఔట్ అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే.. ఆ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని స్థానిక సంస్థల ఎన్నికల మొదట్లో జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కడప జిల్లాలోనే అత్యధిక ఏకగ్రీవాలు జరగడంతో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీకి మూడు సీట్లే వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ మూడు చోట్ల మాత్రమే పోటీలో ఉంది. వీటిలో ఒక్కటి కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. దీన్ని బట్టి.. ఈ రెండేళ్లలో వైసీపీ బలం దారుణంగా పడిపోయిందని.. మున్సిపల్ ఎన్నికల ట్రెండ్ స్పష్టం చేస్తోంది.











