ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు, నామినేషన్ల గడువు పొడిగింపు పేరిట ప్రక్రియను సాగదీసేందుకు YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన చివరి పాచిక ఘోరంగా ఫెయిల్ అయింది. నామినేషన్ల గడువు పెంచాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చింది. కోర్టుల ద్వారా ఎన్నికల ప్రక్రియను నిలిపివేయవచ్చనే జగన్ ఆశలపై సుప్రీంకోర్టు తీర్పు నీళ్లు చల్లింది.
పిటిషన్ను కొట్టివేసే సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నాయకత్వానికి తీవ్ర పరాభవాన్ని మిగిల్చాయి. ఎన్నికల ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. ఇకపై ఈ విషయంలో మేం ఎలాంటి జోక్యం చేసుకోలేం..ధైర్యంగా ఎన్నికలకు వెళ్లండి, ఆల్ ది బెస్ట్ అంటూ ధర్మాసనం కామెంట్స్ చేసింది. అంతేకాకుండా, స్థానిక పోరులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాల కనుసన్నల్లోనే పారదర్శకంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.
న్యాయపోరాటం పేరుతో కాలయాపన చేసి ఎన్నికల నుంచి పారిపోయేందుకు జగన్ పన్నిన వ్యూహాలన్నింటికీ సుప్రీంకోర్టు డోర్లు క్లోజ్ చేసింది. ఇకపై స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇలాంటి పిటిషన్లతో తమ వద్దకు గానీ, లేదా హైకోర్టుకు గానీ వెళ్లేందుకు వీలులేదని స్పష్టం చేసింది. ఏమైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఎలక్షన్ ట్రైబ్యునల్లోనే తేల్చుకోవాలని ఆదేశించడంతో, జగన్ ఆశలు అడియాసలై కోర్టులో పూర్తిగా ముఖం చాటేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ కీలక పరిణామంతో ఏపీలోని కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొనే ధైర్యం లేకే జగన్ కోర్టుల చుట్టూ తిరిగారని, ఇప్పుడు కోర్టు తీర్పుతో వైసీపీ నాటకాలకు తెరపడిందని కూటమి నేతలు మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో స్థానిక పోరులో కూటమి ఘనవిజయం సాధించి, వైసీపీని కూకటివేళ్లతో తుడిచిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.











