కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు జైలర్ విషయంలో ఇది అక్షర సత్యమనే చెప్పాలి. 72 ఏళ్ల వయసులో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ విడదలైన 18 రోజుల్లో రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం పెద్ద రికార్డుగానే చెప్పాలి.
ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలుకు చేరువైంది. తమిళనాడులో అత్యధిక వసూళ్ల రికార్డు రజనీ పేరుతోనే ఉంది. ఈ సినిమా హిందీ, తెలుగు, చైనా వసూళ్లు కలిపి రూ. 656 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు రెండో స్థానంలో జైలర్ నిలిచింది. తాజా రిపోర్ట్ ప్రకారం రూ. 600 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. పైగా ఇంకా థియేటర్లలో భారీ వసూళ్లు సాధిస్తోంది. మరో వారం పాటు ఇలాగే ఉంటే రజనీ తన రికార్డును తనే బ్రేక్ చేయడం ఖాయం. తమిళనాడులో అత్యధిక రికార్డుల వసూళ్లలో పొన్నియన్ సెల్వం మూడో స్థానంలో ఉంది. అది 498 కోట్ల వసూళ్లు సాధించింది. కమల్ హాసన్ విక్రమ్ 446 కోట్లు వసూళ్లు చేసింది. ఈ రెండు చిత్రాలను దాటుకుని రజనీ జైలర్ ముందుకు దూసుకుపోయింది. అంతేకాదు జైలర్ తో పోటీపడి గదర్ 2 కూడా దూసుకుపోతోంది.
బడ్జెట్ పరంగా చూస్తే..
బడ్జెట్ పరంగా చూస్తే భారీ కలెక్షన్లు సాధించిన బాహుబలి, పొన్నియన్ సెల్వన్ లాంటి చిత్రాలతో పోలిస్తే జైలర్ నిర్మాణ వ్యయం తక్కువే అని చెప్పాలి. ఇండియాలో కలెక్షన్ల పరంగా అత్యధిక రికార్డు దంగల్ పేరుతోనే ఉంది. ఆ సినిమా దాదాపు 2000 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. కాకపోతే ఆ సినిమా చైనా వసూళ్లే ఎక్కువ. ఆ తర్వాత స్థానంలో బాహుబలి ది కంక్లూజన్ ఉంది. ట్రిపుల్ ఆర్ కూడా దాదాపు 1200 కోట్ల వసూళ్లు సాధించింది. కేజీఎఫ్ 2 కూడా అంతే. కాకపోతే ఆ రికార్డులు అధిగమించడం ఇప్పట్లో అసాధ్యం. షారుఖ్ ఖాన్ జవాన్ విడుదలయ్యేవరకూ జైలర్ దూకుడును ఎవరూ ఆపలేరు.
కాలం కలిసి వచ్చింది..
జైలర్ సినిమాకు కాలం కలిసి వచ్చింది. ముఖ్యంగా తెలుగునాట ఈ సినిమాను 12 కోట్లకే కొన్నారు. కానీ 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీనికి కారణం ఈ సినిమాతోపాటు విడుదలైన భోళా శంకర్ ఫ్లాప్ అవ్వడమే. ఆ తర్వాత ఆగస్టు 15 సెలవుదినం కావడం కూడా కలిసి వచ్చింది. రెండో వారంలో విడుదలైన సినిమాలకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. అదే పరిస్థితి మూడో వారంలోనూ ఎదురైంది. దాంతో తెలుగులో కలెక్షన్ల పరంగా వీరకుమ్ముడు కొనసాగింది. ఈ సినిమాని ఏషియన్ ఫిలింస్ తో కలిసి దిల్ రాజు విడుదల చేశారు. డైరెక్ట్ సినిమాల కన్నా ఇలాంటి సినిమా ఒకటి దొరికితే బాగుండు అనేలా పరిస్థితి తయారైంది.