జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. జనసేనను గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. అంతేకాదు గాజు గ్లాస్‌ను జనసేన కోసం రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేసింది ఈసీ. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌కు లేఖ రాసింది. ఈసీ తాజా నిర్ణయంతో ఇకపై జనసేన పోటీలో ఉన్నా లేకున్నా గాజు గ్లాసును మరొకరికి కేటాయించరన్న మాట.
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సృష్టించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్‌సభ స్థానాల్లోనూ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 6 శాతం ఓట్లు సాధించింది.
దేశంలో రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం వివిధ కేటగిరీలుగా విభజిస్తుంటుంది. ప్రస్తుతం జనసేన కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీగానే కొనసాగుతుంది. పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం, గెలిచిన సీట్ల ఆధారంగా పార్టీలకు గుర్తింపు దక్కుతుంది. 2014లో జనసేనను స్థాపించారు పవన్‌కల్యాణ్. ఆ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ…టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. తర్వాత 2019లో కమ్యూనిస్టు, బీఎస్పీ పార్టీలతో కలిసి పోటీ చేసిన జనసేన ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఈసీ నిర్ణయంపై జనసేన స్పందించింది. ఇది పవన్ పోరాటానికి దక్కిన ఫలితమని పేర్కొంది.
జనసేనను గుర్తింపు పొందిన జాబితాలో ఈసీ ప్రకటించడంతో జగన్‌కు బిగ్‌షాక్ తగిలినట్లయింది. ఇప్పటివరకూ ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్యే పోరు నడిచింది. జనసేనను గుర్తిస్తున్నట్లు ఈసీ ప్రకటించడంతో ఏపీలో జనసేనను మరింత బలోపేతం చేసే అవకాశం పవన్‌కల్యాణ్‌కు లభించినట్లయింది. భవిష్యత్తులో వైసీపీ స్థానాన్ని జనసేన భర్తీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ అసంతృప్త నేతలు జనసేన వైపు చూస్తున్నారు. ఈసీ నిర్ణయంతో వైసీపీ నుంచి జనసేనలోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది.