దేశం కోసం మరో తెలుగు జవాను ప్రాణాలర్పించారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన యువ సైనికుడు మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి(23) జమ్ముకశ్మీర్ రాజోరి జిల్లాలోని సుందర్‌బాని సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందారు. బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంలోని తల్లిదండ్రులకు శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు ఈ మేరకు సమాచారం అందించారు. 2016లో మద్రాసు రెజిమెంట్‌లో సైన్యంలో చేరిన జశ్వంత్‌రెడ్డి కొంత కాలం నీలగిరిలో పని చేశారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నజశ్వంత్ నాలుగు నెలల క్రితం సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లారు. మరో నెల రోజుల్లో అతనికి వివాహం చేసేందుకు తల్లి ధండ్రులు ఏర్పాట్లు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో మృతుని తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డి కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. శుక్రవారం రాత్రికి జశ్వంత్‌రెడ్డి మృతదేహం బాపట్ల చేరుకోవచ్చని అధికారుల నుంచి సమాచారం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టగా, ముష్కరుల కాల్పుల్లో వీరమరణం పొందిన ఇద్దరు జవాన్లలో జశ్వంత్‌రెడ్డి ఒకరు.
రూ.50 లక్షల ఆర్థిక సాయం
వీర మరణం పొందిన జశ్వంత్‌రెడ్డికి ఏపీ సీఎం జగన్ నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుని కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. జశ్వంత్‌రెడ్డి ధైర్య సాహసాలు, త్యాగం చిరస్మరణీయమని జగన్ కీర్తించారు.
Must Read ;- జగన్ గారు.. విజయమ్మను గెంటేస్తారా..?