మా ఎన్నికల్లో మహిళా లోకానికి నటుడు ప్రకాష్ రాజ్ పెద్ద పీట వేయడానికి సిద్ధమయ్యారు. ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన తీరుతో ఆయన ప్యానల్ స్వరూపం మారిపోనుంది. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు తనయుడు విష్ణును ఆయన ఎదుర్కోబోతున్నారు. గతంలో తన ప్యానల్ ను ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అప్పుడు ఆయన ప్యానల్ లో లేని జీవిత, హేమ పేర్లను ఇప్పుడు వినిపించారు. వచ్చే నెల 10న ఎన్నికలు జరగనున్నాయి.
తన ప్యానల్ ఉన్న వాళ్లంతా పదవి కోసం వచ్చిన వారు కాదని, పనిచేసేందుకు మాత్రమే వచ్చారని ఆయన పేర్కొన్నారు. తన ప్యానల్ లో చిన్న చిన్న మార్పులు చేసినట్టు ఆయన ప్రకటించారు. జయసుధ ఈసారి పోటీ చేయడం లేదని, ఆమె అమెరికాలో ఉండాల్సి రావడం వల్ల ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. కొత్తగా జీవిత, హేమ ఈ ప్యానల్ లో ఉంటున్నారు. హీరో రాజశేఖర్ మద్దతు కూడా తమకు ఉందన్నారు. చిన్న నటీనటులకు పెద్ద పీట వేయాలన్నది తమ అభిమతమని చెప్పారు.
మా అసోసియేషన్ కు సొంత భవనం ఒక్కటే ముఖ్యంగా కాదని, చిన్న నటుల సంక్షేమం కూడా అవసరమన్నారు. సొంతభవనమే ముఖ్యమని భావిస్తే విష్ణునే గెలిపిస్తారన్నారు. భవనం నిర్మించేంత డబ్బు తన దగ్గర లేదన్నారు. హేమ, జీవిత సేవలు తమకు అవసరమని భావించామని చెప్పారు. నోటిఫికేషన్ రాగానే అన్ని విషయాలనూ ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తామన్నారు. గతంలో తాను ఓటు వేయలేదని అనడం నిజం కాదన్నారు. మా సభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తనకు ఉందన్నారు. తెలంగాణలో మూడు గ్రామాలను దత్తత తీసుకుని సేవలందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
డగ్స్ వ్యవహారంలో చట్టం తనపని తను చేసుకుపోతుందని చెప్పారు. దోషులుగా తేలితేనే చర్యలుంటాయన్నారు. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీపడితే ప్రధాన కార్యదర్శి పదవికి ఎవరు అన్నది త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. జీవిత, హేమ ఇద్దరినీ కార్యదర్శుల్ని చేసే ఆలోచన ప్రకాష్ రాజ్ కు ఉంది. ఆ విధంగానే ఆ ఇద్దరినీ ఒప్పించారు. అధ్యక్ష పదవికి ఈసారి ముఖాముఖి పోటీనే ఉండటానికి మార్గం కొంతవరకు సుగమమైంది. తెలంగాణ వాదం పేరుతో సీవీఎల్ నరసింహారావు కూడా తాను బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. అది తేలాల్సి ఉంది. మొత్తానికి ఇద్దరు నారీమణుల్ని ఏకం చేయడంలో మాత్రం ప్రకాష్ రాజ్ సఫలీ కృతులయ్యారు.
Must Read ;- అక్టోబరు 10న మా అసోసియేషన్ ఎన్నికలు