కరోనా సెకండ్ వేవ్ తగ్గి.. ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. మరో కొత్త రకం వైరస్ డెల్టా వేరియంట్ భయపెడుతోంది. ఇప్పటికే దేశంలో పలుచోట్ల కేసులు సైతం వెలుగుచూశాయి. మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. దాదాపు వంద దేశాల్లో డెల్టా వ్యాప్తిచెందడమే అందుకు కారణం. యూకేలో లెక్కలు మించి కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఇండియాతోపాటు ఇతర దేశాలకు డెల్టా భయం పట్టుకుంది.
డెల్టాను చంపిన జాన్సన్ అండ్ జాన్సన్
కొవిడ్ కారణంగా ఇప్పటికే ఎన్నో రకాల వైరస్ లు బయటపడ్డాయి. అవన్నీ ప్రస్తుత వ్యాక్సిన్లకు తొకముడిచాయి. ఇప్పుడు డెల్లా వేరియంట్ కూడా తగ్గుతుందా లేక ప్రభావం చూపుతుందా? అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ ముఖ్యమైన ప్రకటన చేసింది. తమ కంపెనీ తయారు చేసిన సింగిల్ డోస్ డెల్టాపై ప్రభావం చూపుతుందని, ఇతర వైరస్ లపై బాగా సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించింది. డెల్టా వేరియంట్‌ను నిలువరించేందుకు అవసరమైన యాంటీబాడీలను,రోగ నిరోధకతను ఉత్పత్తి చేయడంలోనూ పనిచేస్తుందని, దాదాపు 8 నెలల పాటు వైరస్ బారి నుంచి కాపాడుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా లాంటి వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేశాయని, తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ కూడా అన్ని వేరియంట్లపై పోరాడుతుందని వెల్లడించింది.
ఇది ప్రమాదకర వైరస్
డెల్టా వేరియంట్.. ఒరిజినల్ వేరియంట్ కంటే రెండున్నర రెట్లు వేగంగా విస్తరిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ ప్రమాదకరమైన వైరస్‌గా గుర్తించింది. డెల్టా వేరియంట్ ను ఎదుర్కోనేందుకు ఇతర దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ చురుగ్గా సాగుతున్నాయి. ఇజ్రాయిల్, యుకేలాంటి దేశాలు ఇప్పటికే ప్రయోగాలు సైతం మొదలుపెట్టాయి. కానీ భారత్‌లో ఎలాంటి ప్రయోగాలు జరగడం లేదు. త్వరలోనే డెల్టాపై క్లినికల్ ప్రయోగాలు చేసి, వ్యాక్సిన్లను తయారు చేస్తామని పలు కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అయితే డెల్టా వేరియంట్ పై కోవాగ్జిన్ పనితీరు మెరుగ్గా ఉండటంతో.. భారత్ బయోటెక్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.
Must Read ;- ‘డెల్టా’ ప్రమాదకరం.. వ్యాక్సిన్ తీసుకుంటే కొంతవరకు సురక్షితం