(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఎట్టకేలకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు, రామతీర్థంలో చోటుచేసుకున్న రగడ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే నివేదిక అందజేయాలని ఆదేశించడంతో డీజీపీ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు జియో ట్యాగింగ్ చేయాలని, సీసీ కెమెరాలు అమర్చాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. మత సామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చుపెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ ఆదేశించారు. దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్, విజిటబుల్ పోలీసింగ్‌కు ఆదేశాలిచ్చినట్లు డీజీపీ తెలిపారు. ఆలయాలు, ప్రార్ధనా మందిరాల పవిత్రతను కాపాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డీజీపీ అన్నారు. ఆలయాల్లో పనిచేసే అర్చకులు, పూజారులు, ఆలయాల నిర్వాహకులు నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే తక్షణమే సమాచారాన్ని పోలీసులకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల భద్రతా చర్యలను పర్యవేక్షించాలని అన్ని జిల్లాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రామతీర్థంపై పూర్తి స్థాయి విచారణ
రామతీర్థం ఘటనపై విజయనగరం జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 21 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ఆలయ కొలనులో శ్రీరాముడి విగ్రహ శిరస్సు భాగాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అక్కడే హాక్సా బ్లేడును సేకరించారు. దుండగులు పగుల గొట్టిన ఆళయ తాళాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. అనుమానితుల నుంచి వేలిముద్రలు సేకరించిన అధికారులు ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలపై ఉన్న వేలిముద్రలతో పోల్చి చూస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెడతామని పోలీసులు చెప్తున్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.










