జగన్ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ మరో భారీ భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరులో అత్యంత విలువైన సుమారు రూ. 25-30 కోట్ల ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – SIDC భూమిని ఆయన తన అనుచరులతో కలిసి కబ్జా చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై AP SIDC చైర్మన్ లీలాకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయడంతో, ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశించింది.
గుంటూరులో SIDC ప్రధాన కార్యాలయం కోసం 1990లో కేటాయించిన 1,840 చదరపు మీటర్ల స్థలం ఇది. వైసీపీ ప్రభుత్వంలో ఈ భూమిని కాజేసేందుకు పందుల పెంపకందారుల పేరుతో ఓ డ్రామా ఆడారు. పందుల పెంపకందారులు ఓ ప్రైవేట్ వ్యక్తి భూమిని ఆక్రమించుకున్నారని, ఆ వ్యక్తికి పరిహారంగా ఈ SIDC భూమిని ఇప్పించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల అండతో ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే ఆ ప్రైవేట్ వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించాడు. అతను జోగి రమేష్ కి అత్యంత సన్నిహితుడు.. ఆప్తుడిగా గుర్తించారు..
ఈ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రధాన పాత్ర పోషించారని SIDC బోర్డు నిర్ధారించింది. ఆ ప్రైవేట్ వ్యక్తికి భూమి కట్టబెట్టే కుట్ర వెనుక ఉన్నది జోగి రమేష్ నని, ప్రస్తుతం ఆ భూమి ఆయన నియంత్రణలోనే ఉందని చైర్మన్ లీలాకృష్ణ సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. భూమి రక్షణకు చర్యలు తీసుకోని నాటి ఇరిగేషన్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
చైర్మన్ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న సీఎం చంద్రబాబు, వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. ఈ భూకబ్జా వెనుక కుట్ర, జోగి రమేష్ పాత్ర, అధికారుల మద్దతు తదితర అంశాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సమగ్ర విచారణ చేపట్టనుంది.











