హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ప్రేమించేవారికి విందు చేసేందుకు కీనూ రీవ్స్ సన్నద్ధమవుతున్నాడు. కీనూ రీవ్స్ అంటే చెప్పేదేముంటుంది.. జాన్ విక్. ఇప్పటిదాకా ఈ కేటగిరీలో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. జాన్ విక్ మొదటి భాగం సక్సెస్ అయినంతగా మిగిలిన భాగాలు కాలేదు. 2014లో కీనూ రీవ్స్ శకం ప్రారంభమైందని చెప్పాలి. జాన్ విక్ ఆ ఏడాది విడుదలైంది. ఇతర భాషల్లోనూ ఈ స్టోరీ లైన్ తీసుకుని చాలా సినిమాలు వచ్చాయి. ఒకవిధంగా రజినీ ‘బాషా’ ప్లాట్ నే ఇది పోలి ఉంటుంది.
శత్రువుల గుండెల్లో దడ పుట్టించే పాత్ర ఇది. ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లు చూసి దీనికి సీక్వెల్ చేయాల్సిందేనని నిర్మాణ సంస్థ నిర్ణయించుకుని దాన్ని కొనసాగిస్తోంది. 2017లో జాన్ విక్ 2, 2019లో జాన్ విక్ 3 విడుదలయ్యాయి. అవేవీ మొదటి చిత్రాన్ని మించలేకపోయాయి. అయినా దీన్ని కొనసాగించాలనే మేకర్స్ నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పుడు జాన్ విక్ 4 ముస్తాబవుతోంది. దీన్ని 2022 మే 27న విడుదలచేయనున్నారు. అక్కడితో ఆగలేదు జాన్ విక్ 5 కూడా రూపొందబోతోంది.
జాన్ విక్ 4 విషయానికి వస్తే యాక్షన్-ఫాంటసీ చిత్రం ‘హైలాండర్’ గుర్తుందా? అందులో మెయిన్ విలన్ క్లాన్సీ బ్రౌన్ ఇందులో నటిస్తున్నారు. కీనూ రీవ్స్ తో కలిసి అతను తలపడటం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు యానిమేషన్ చిత్రం ‘ది స్పాంజ్ బాబ్ మూవీ: స్పాంజ్ ఆన్ ది రన్’లో నటించారు. దర్శకుడు చాడ్ స్టహెల్స్కీ మాట్లాడుతూ ‘నేను క్లాన్సీ బ్రౌన్ అభిమానిని. అతడిని ఈ ప్రాజెక్ట్‌లో నటించడం ఈ ప్రాజెక్ట్ కే గౌరవం. అతను జాన్ విక్ ప్రపంచానికి న్యాయం చేస్తాడు’ అన్నారు.
క్లాన్సీ బ్రౌన్ చేతిలో ఇప్పుడు పవర్ పుల్ సినిమాలు ఉన్నాయి. విలన్ గా ‘లాస్ట్ లుక్స్’ లో మెల్ గిబ్సన్ తో ఢీకొనబోతున్నాడు. ఇది కాకుండా ‘డెక్స్టర్: న్యూ బ్లడ్’ లోనూ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నవంబరులోనే విడుదల కానుంది. జాన్ విక్ షూటింగ్ ఫ్రాన్స్, జపాన్ లలో జరుగుతోంది. కొన్ని లోటు పాట్లను సవరించుకుని జాన్ విక్ స్టామినాను మరోసారి నిరూపించుకుంటే బాగుంటుందని జాన్ విక్ సిరీస్ అభిమానులు కోరుకుంటున్నారు.
Must Read ;- గూఢచారి కి మూడేళ్లు .. సీక్వెల్ కి రంగం సిద్ధం!











