హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నెలకొన్న ముసలం అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మొహ్మద్ అజారుద్దీన్ ను తొలగించిన అపెక్స్ కౌన్సిల్… హెచ్‌సీఏలో ఏకంగా ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనపై తొలుత తనదైన శైలిలో నిరసన తెలిపేందుకు యత్నించిన అజార్.. ఆ తర్వాత కారణమేమిటో గానీ సైలెంట్ అయిపోయారు. తాజాగా అజార్ స్థానంలో జాజ్ మనోజ్ ను నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ మరింత సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
వెంటవెంటనే కీలక నిర్ణయాలు
ప్రస్తుతం జాజ్ మనోజ్ హెచ్‌సీఏ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. నిన్నటిదాకా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జాజ్ మనోజ్ ను ప్రెసిడెంట్ గా నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ నియమించడాన్ని చూస్తుంటే… ఇక కమిటీలోకి గానీ, అసోసియేషన్ లోకి గానీ అజార్ కు ఎంట్రీ లభించడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అజార్ ను ప్రెసిడెంట్ స్థానం నుంచి తప్పించడం, ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఆయన స్థానంలో జాజ్ ను నియమించడం చూస్తుంటే… ఇప్పుడప్పుడే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కూడా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సమూల మార్పునకు గ్యాప్ ఇచ్చారా?
అజార్ ను హెచ్‌సీఏ నుంచి గెంటేస్తూ అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హెచ్‌సీఏపై సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్ను పడిందని, త్వరలోనే ఆమె హెచ్‌సీఏ బాధ్యతలను చేపట్టనున్నారన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే… ఈ తరహా మార్పులకు మరింత సమయం తీసుకునే దిశగా కవిత ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- హెచ్‌సీఏపై కవిత నజర్?.. అందుకే అజార్‌ను గెంటేస్తున్నారా?