(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
బొత్స సత్యనారాయణ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని రాజకీయ నాయకుడు ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ఆయనో ట్రెండ్ సెట్టర్. ఆయన ప్రతీ కదలిక.. ప్రతీ మాటా ఓ సంచలనమే. కాంగ్రెస్ రాజకీయాలలో ఉన్నత శిఖరాలను తాకి.. ముఖ్యమంత్రి పీఠానికి మూడు అడుగుల దూరంలో నిలిచిపోయినా.. ఆంధ్రప్రదేశ్ విభజన ఉద్యమం ఉదృతంగా సాగుతున్న తరుణంలో ‘తెలంగాణ విడిపోతే తప్పేంటి’ అంటూ ఆంధ్రుల ఆగ్రహానికి గురైనా.. సొంత గడ్డ విజయనగరంలో కర్ఫ్యూకు కారణమైనా .. ఆయనకే చెల్లింది. అటువంటి బొత్స.. ప్రతి కదలికనూ రాష్ట్రంలో విపక్షంతో పాటు.. స్వపక్షం కూడా ఒక కంటితో నిత్యం కనిపెడుతుంటోంది. తలపండిన రాజకీయ నాయకుల అంచనాలకూ అందని విధంగా ఆయన అడుగులు పడుతుంటాయి. ప్రస్తుతం అటువంటి అడుగే ఆకస్మికంగా వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇచ్చారు. విజయనగరం జిల్లాలో అయితే ఏ ఇద్దరు కలిసినా ప్రస్తుతం ఈ అంశంపైనే చర్చిస్తున్నారు.
వారసుడు రంగప్రవేశం
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయనగరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి ముద్దుల తనయుడు బొత్స సందీప్. వైద్య విద్యను అభ్యసించి, డాక్టర్ గా స్థిరపడినప్పటికీ నిన్నటివరకూ విజయనగరం ప్రజలకు పెద్దగా పరిచయం లేని మోము. తాజాగా ఆయన జన్మదినోత్సవం సందర్భంగా విజయనగరం అంతా ఆయన ఫొటోతో కూడిన పెద్ద పెద్ద ప్లెక్సీలు వెలిసాయి. బొత్స యువసేన పేరుతో అభినందనలు వెల్లువెత్తాయి. ప్రేమ సమాజంలో వృద్ధులకు పళ్లు పంపిణీ, అనాధ పిల్లలకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ లాంటి సాదాసీదా కార్యక్రమాలతో ముగిసాయి. అంతవరకే అయితే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏముంటుంది కదా! ఆ ప్లెక్షీలపై జిల్లా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫొటోలూ కనిపించాయి. అందువల్ల బొత్స తన తనయునికి రాజకీయ ఆరంగేట్రానికి ముహూర్తం నిర్ణయించారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే తరుణంలో అమరావతిలోనూ సందీప్ ప్రత్యక్షమవ్వడం, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు చాలామంది ఆయనను కలిసి అభినందించడం చకచకా జరిగిపోయాయి. అందువల్ల రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన చర్చలకు మరింతబలం చేకూరింది.
Must Read ;- బొత్స కుటుంబంలో ముసలం
ఒకటిరెండు రోజుల్లో సీఎంకు పరిచయం
ఒకటి రెండు రోజుల్లో వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ను తన తనయుని బొత్స సతీసమేతంగా పరిచయం చేయనున్నారని, ఆ తరువాత రాజకీయ రంగప్రవేశంపై కీలక ప్రకటన చేయనున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. విజయనగరం జిల్లాలో ముఖ్యంగా ఆయన కాపు కాస్తున్న చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం, ఎస్ కోట, బొబ్బిలి నియోజకవర్గాలలోను, అత్యంత ముఖ్యమైన విజయనగరంలోనూ ప్రస్తుత రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తున్న తరుణంలో తనయుడును తెరపైకి తేవడం వాడివేడి చర్చలకు తావిస్తోంది.
‘పదును చూసి వ్యవసాయం చేయాలి .. అదును చూసి రాజకీయం చేయాలి’ అనేది శతశాతం వంట పట్టించుకున్న బొత్స రాజకీయ వ్యూహం రేపు ఎలా ఉంటుందో వేచిచూడాలి.
Also Read ;- ఆధిపత్య పోరులో అభివృద్ధి మరిచారు.. ఉత్తరాంధ్ర వాసుల ఆవేదన