‘బాహుబలి’ సృష్టించిన ప్రభంజనం ఇంకా బాలీవుడ్ ను వీడిపోలేదు. ఆ సినిమాతో ప్రభాస్ క్రియేట్ చేసుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉత్తరాదిన ఇప్పటివరకూ అతడి స్థాయిలో పేరు తెచ్చుకున్న సౌత్ స్టార్ లేనే లేడు. ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలుతున్న ఖాన్స్ అండ్ కపూర్స్ అభిమానులు సైతం ప్రభాస్ ను ఆరాధిస్తున్నారంటే.. అతడి స్థాయి ఎంతలా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. కథ పరంగానూ, టేకింగ్ పరంగానూ విమర్శలెదుర్కొన్న ‘సాహో’ సైతం బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చుకుంది. అందుకే ఇప్పుడు ప్రభాస్ తో అదే స్థాయిలో ‘ఆదిపురుష్’ అనే భారీ బడ్జెట్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ఓం రౌత్.
ఈ సినిమా ఇలా అనౌన్స్ అయ్యిందో లేదో.. అప్పుడే బాలీవుడ్ లో ప్రభాస్ గురించే చర్చలు సాగుతున్నాయి. అంతటి స్థాయిలో తన ఇమేజ్ ను పెంచుకున్న ప్రభాస్ ప్రేరణ తో ఇప్పుడు జూనియర్ యన్టీఆర్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేశాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీతో బాలీవుడ్ మార్కెట్ ను ఓ రేంజ్ లో ఆక్యుపై చేయాలని చూస్తున్నాడట. ఆ మేరకు దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను బాలీవుడ్ లో బ్రహ్మాండంగా ప్రచారం చేసే వ్యూహాత్మక ఆలోచనతో ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. అంతేకాదు ఇదే సినిమాతో రామ్ చరణ్ సైతం బాలీవుడ్ మార్కెట్ పై హోప్స్ పెట్టుకున్నాడట. ఆల్రెడీ మనోడు జంజీర్ సినిమాతో బాలీవుడ్ వాసులకు సుపరిచితుడే.
ఆ సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే.. జంజీర్ స్టార్ గా రామ్ చరణ్ కు బాలీవుడ్ లో ఓ గుర్తింపు ఉంది. అలా… ఒకే సినిమాతో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ లో ప్రభాస్ లాగానే జెండా పాతే ఉద్దేశంలో ఉన్నారని అర్ధమౌతోంది. తారక్ కు బాలీవుడ్ మార్కెట్లోకి చొచ్చుకుపోవడానికి ఇప్పుడు మరో మూవీ కూడా యాడ్ కాబోతోంది. ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ .. తారక్ తో ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సైంటిఫిక్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే లాంఛ్ కాబోతోంది. ఇది కూడా పాన్ ఇండియా కేటగిరిలోని సినిమానే.
ఆల్రెడీ ‘కోలార్ గోల్డ్ మైన్స్’ (కేజీయఫ్ ) మూవీతో పాన్ ఇండియా కేటగిరిలో అన్ని భాషల్లోనూ సక్సెస్ అయిన అనుభవం కలిగిన ప్రశాంత్ నీల్ .. ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమాతో పాటు తారక్ ఓ బాలీవుడ్ దర్శకుడితో పనిచేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమా కూడా అదే రేంజ్ లో నిర్మాణం జరుపుకోనుంది. ఆ మేరకు బాలీవుడ్ దర్శకుడితో తారక్ చర్చలు జరుపుతున్నాడట. ఇందులో యన్టీఆర్ కిక్ బాక్సర్ గా నటించబోతున్నడని టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికోసం తారక్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయబోతున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.











