క్రిస్మస్ వేడుకల్ని, శాంతి సందేశ సభకు అనుమతులు రద్దు చేయడంతో మొన్నటి రోజున లైవ్ పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డికి శాపనార్థాలు పెట్టిన కెఏ పాల్ మళ్లీ లైవ్‌లోకి వచ్చి మరోసారి మాటలతో బ్యాటింగ్ చేశాడు కెఏ పాల్. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన శాంతి సందేశ సభను రద్దు చేసి 72 గంటలవుతున్నా కూడా జగన్ ఏ మాత్రం స్పందించడం లేదని, ఇప్పటికైనా జగన్ మారితే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని చప్పుకొచ్చారు కెఏ పాల్.
కళ్లు నెత్తికెక్కాయి..
ఆంధ్రప్రదేశ్‌కి సిఎం అయితే ఏంటి? కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నాడని కౌంటర్ ఇచ్చారు పాల్. అందరూ క్షమించమని చెప్తున్నారని, తను క్షమించడానికి సిద్ధమేనని, కానీ దేవుడు క్షమించడు, అందుకే ఇప్పటికైనా సైతాన్ మార్గం వీడి మంచి మార్గంలోకి వచ్చి దేవుని సువార్తను రద్దు చేసినందుకు క్షమాపణలు చెప్పుకోవాలని కాస్త గట్టిగానే డిమాండ్ చేశారు. ప్రజలకు శాంతి సందేశాన్ని అందించడానికి చీఫ్ గెస్ట్‌గా జగన్‌మోహన్ రెడ్డిని పిలిస్తే లెక్కచేయకుండా.. పైగా కార్యక్రమాన్ని రద్దు చేయడం బాధాకరమని కెఏ పాల్ జగన్ చర్యలను ఖండించారు.
భారత్ చీఫ్ జస్టీస్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మానవ హక్కుల సంఘం, ఇంటర్నేషనల్ కోర్టు.. అందరూ నాకు తెలుసు. రద్దు చేశాక కూడా స్పందించలేదు కనక వీరందరితో జగన్ వ్యవహారం మాట్లాడి తేల్చాల్సిన సమయం వచ్చిందంటూ పాల్ ఊగిపోయారు. లీగల్ కూడా ఈ వ్యవహారంపై చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు పాల్ వెల్లడించారు. ఇలాంటి అన్యాయాలు 2005 నుండి జరుగుతున్నాయి. కలిసి పనిచేస్తేనే వీటినుండి క్రైస్తవులకు విముక్తి లభిస్తుంది. నేను ప్రపంచం కొరకు పాటుపడతా.. మీ కోసం ప్రాణం పెడతా.. అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ట్రంప్‌కే దిక్కు లేదు.. నేను ఎవరినీ లెక్కచేయను.. ఒక్క దేవునికి తప్ప సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
Must Read ;- ఆలయంలో క్రిస్మస్ గ్రీటింగ్స్ : భజనా? బరితెగింపా?