టీడీపీ సీనియర్ నేత, పార్టీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు బీజేపీలో చేరిపోతున్నారా? ఆ క్రమంలోనే ఆయన ఇంటికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెళుతున్నారా? రేపోమాపో టీడీపీని వీడనున్న కళా.. ఆ మరుక్షణమే కమలం గూటికి చేరతారా?…ఇలా శుక్రవారం ఉదయం నుంచి పలు వెబ్ సైట్లు, టీవీ ఛానెళ్లలో పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. అయినా ఏం తక్కువైందని కళా పార్టీ మారతారన్న విషయాన్ని పట్టించుకోని ఆయా ఛానెళ్లు, సైట్లు అదే పనిగా ఈ వార్తను సర్క్యూలేట్ చేసేశాయి. అయితే, ఈ ప్రచారమంతా శుద్ధ అబద్ధమని, తాను పార్టీ మారడం లేదని, అసలు టీడీపీని వీడటం గానీ, చంద్రబాబుకు దూరంగా జరగడం గానీ ఉండబోదని కళా స్వయంగా వెల్లడించినా గానీ ఈ ప్రచారం ఆగలేదు. ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే…
నేడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో భేటీ
బీజేపీ ఏపీ శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సోము వీర్రాజు తనదైన శైలిలో ఇతర పార్టీల నేతలతో భేటీలు అవుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వీర్రాజు… తొలుత తన సొంత సామాజిక వర్గానికి చెందిన మెగా స్టార్ చిరంజీవితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా కలిశారు. ఆ తర్వాత తన సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలతో వరుసగా భేటీలు వేస్తున్న వీర్రాజు… శనివారం కాపు ఉద్యమ నేతగా పేరుగాంచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో భేటీ కానున్నారు. తన సొంత జిల్లా తూర్పు గోదావరిలోని ముద్రగడ సొంత గ్రామం కిర్లంపూడి వెళ్లనున్న వీర్రాజు… ముద్రగడతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ముద్రగడతో చర్చించనున్నారట. ఇక్కడిదాకా బాగానే ఉన్నా ముద్రగడతో భేటీ తర్వాత వీర్రాజు… నేరుగా కళా వెంకట్రావు ఇంటికి వెళ్లనున్నారని ఓ ఛానెల్ వార్తను ప్రసారం చేసింది. ఆ వెంటనే కళా వెంకట్రావు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోతున్నారన్న పుకార్లు పుట్టేశాయి.
తప్పుడు వార్తలేనన్న కళా
ఈ విషయం ఆనోటా, ఈ నోటా కళా చెవిన కూడా పడింది. దీంతో షాక్ తిన్న కళా ఇవన్నీ తప్పుడు వార్తలేనని తేల్చేశారు. అయినా టీడీపీలో తనకు ఏం తక్కువ చేశారని తాను పార్టీ మారుతున్నానో చెప్పాలంటూ కళా ఎదురు ప్రశ్నలు సంధించారు. ఏపీ శాఖకు తొలి అధ్యక్షుడిగా కొనసాగిన అవకాశం దక్కిన తనకు చంద్రబాబు ఏకంగా మంత్రి పదవి కూడా కట్టబెట్టారని, ఇప్పటికీ పార్టీలో తాను కీలక పదవిలోనే ఉన్నానని కూడా కళా చెప్పుకొచ్చారు. అయినా పార్టీ మారాల్సిన అవసరం తనకు ఎంతమాత్రం కూడా లేదని ఆయన తేల్చిపారేశారు. ఇలాంటి పుకార్లు పుట్టించే వారికి పనీపాటా ఏమీ లేవన్న విషయం తనకు అర్థమైందని కూడా కళా తనదైన శైలి సెటైర్లు సంధించారు. సోము వీర్రాజు తన ఇంటికి వస్తుంటే.. ముందస్తు సమాచారం తనకు కాకుండా ఇతరులకు ఎలా చేరిందని కూడా కళా ప్రశ్నించారు. ఇప్పటిదాకా వీర్రాజు నుంచి తనకు ఎలాంటి సమాచారం కూడా లేదని కూడా కళా చెప్పుకొచ్చారు. మొత్తంగా తాను టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నానన్న విషయం మొత్తం పుకారేనని కళా కొట్టి పారేశారు.
Must Read ;- వాణీ విశ్వనాధ్‌తో సోము వీర్రాజు : ఏంటి మతలబు?