అభిమానుల కోసం కమల్ హాసన్ పుట్టిన రోజు కానుకను రెడీగా ఉంచారు. ఈ నెల 7వ తేదీ కమల్ హాసన్ 66వ పుట్టిన రోజు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన 232వ చిత్రం చేస్తున్నారు. ఈ విషయాన్ని సెప్టెంబరులో అధికారికంగా ప్రకటించారు. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి # ఉలగనాయగన్ 232 అనే హ్యాష్‌ట్యాగ్ ట్రండింగ్ లో ఉంది. దీని టీజర్ ను కూడా అదే రోజు విడుదల చేస్తారట. శనివారం సాయంత్రం 7 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది.
ఇది టైటిల్ రివీల్ చేసే టీజర్ మాత్రమే. కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపైనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ బ్యానర్ పై కమల్ ఇంతకుముందు అపూర్వ సహోదరులు, సత్య, హేరామ్, విశ్వరూపం, సతీలీలావతి తదితర చిత్రాలు నిర్మించారు. ఓ పక్క రాజకీయ నాయకుడిగా, ఇంకో పక్క నటుడిగా కమల్ రెండు పడవల ప్రయాణానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను అదే రోజు వెల్లడించనున్నారు.