ఒకప్పటి దక్షిణాది అగ్రకథానాయిక, రాజకీయ నాయకురాలు, తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి అయిన జయలలిత జీవిత చరిత్ర పై తమిళనాట చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న ‘తలైవి’ సినిమా చాలా ప్రత్యేకం. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ పరకాయ ప్రవేశం చేస్తుండగా.. ‘యం.జీ.ఆర్’ గా హ్యాండ్సమ్ హీరో అరవింద స్వామి చాలా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.
తమిళ నాట ఐరన్ లేడీగా చక్రం తిప్పిన జయలలిత జీవిత చరిత్రలో ఎన్నో మలుపులు, మరెన్నో విశేషాలు ఉన్నాయి. వాటికి కాస్తంత నాటకీయత జోడించి.. ఈ సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు ఎ.యల్. విజయ్. నేడు జయలలిత పుట్టినరోజును పురస్కరించుకొని మేకర్స్.. ‘తలైవి’ ట్రైలర్ ను విడుదల చేశారు.
జయలలిత కథానాయికగా కోలీవుడ్ లోకి ప్రవేశించడం దగ్గర నుంచి.. ఆమె ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమాన్ని చాలా ఆసక్తికరమైన విధంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అప్పటి ముఖ్యమంత్రి యం.జీ.ఆర్ తో ఆమె సినీ జీవితం.. ఆపై రాజకీయ రంగ ప్రవేశం.. ఇవన్నీ సినిమాలో ప్రధాన ఘట్టాలు గా ఉండబోతున్నాయి. సినిమాలో వాటిని చాలా సహజంగా చిత్రీకరించారు. యం. జీ. ఆర్ గా అరవింద స్వామి గెటప్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంకా ఇందులో కరుణానిధి గా ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా.. ఇతర ముఖ్య పాత్రల్లో బెంగాలి నటుడు జిషు సేన్ గుప్తా, సముద్ర ఖని నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానున్న ‘తలైవి’ చిత్రం ఏ స్థాయిలో జనాదరణ పొందుతుందో చూడాలి.
Must Read ;- తారలు ‘ఫైర్’ బ్రాండ్ అంబాసిడర్ లైతే..