(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
“వడ్డించే వాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్టు” సర్కారు మనదైనప్పుడు ఏమి చేసినా చెల్లుతుందనేది .. జగన్ సర్కారుకు అక్షరాల సరిపోతుందని సిక్కోలు జిల్లాలో ప్రతీ మూల .. ప్రతి నోట చర్చ సాగుతోంది. అదే తరుణంలో అధికార పార్టీలో ఉంటే ఒక న్యాయం .. విపక్షంలో ఉంటే వేరొక న్యాయమా!? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కన్నబాబుకు బెయిల్
విశాఖ జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు పంచాయతీ ఎన్నికల్లో లాలంకోడూరు వార్డుమెంబరు అభ్యర్దిని పోటీనుండి తప్పుకోవాలని అతని బంధువులకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు కన్నబాబు రాజుపై రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
అచ్చన్నకు జైలు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఇంచుమించు ఇటువంటి సంఘటనపైనే పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అచ్చెన్నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వెనువెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. కోర్టులోనూ హాజరు పరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయన తరపున న్యాయవాది బెయిల్‌కు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
Must Read: అచ్చెన్న అరెస్టుతో సిక్కోలులో ఉద్రిక్తత..
టీడీపీ ఉనికిని దెబ్బకొట్టేందుకే ..
శ్రీకాకుళం జిల్లాలో బలంగా ఉన్న టీడీపీ ఉనికిని దెబ్బకొట్టేందుకు .. కేడర్‌ను బలహీన పరిచేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని తెలుగుదేశం వర్గాలు బహిర్గతంగా ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎదురుపడి ధైర్యంగా ఎదుర్కోలేక .. ఇటువంటి దొంగచాటు వ్యవహారాలకు వైసీపీ పూనుకుంటోందని చెబుతున్నాయి. నిమ్మాడకు చెందిన కింజరాపు అప్పన్న .. అచ్చెన్న కుటుంబీకుడేనని .. ఆయనతో ఫోనులో అచ్చెన్న మర్యాదపూర్వకంగా మాట్లాడారని, ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదని .. అకారణంగా అచ్చెన్నను అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బెదిరింపులకు పాల్పడ్డ దువ్వాడపై చర్యలేవి?
నిమ్మాడలో బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి దువ్వాడ శ్రీనివాస్‌పై ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడంపై టీడీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అదే తరుణంలో వైసీపీ నేత దువ్వాడపై ఎస్ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను టీడీపీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమా, అశోక్‌బాబు, వెంకటరాజులు కలిశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ ‘సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరాం. మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని ఎస్ఈసీ ఆదేశాలను మేము అమలు చేశాం. ఏ నిబంధనల ప్రకారం మేనిఫెస్టో రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారని ఎస్ఈసీని అడిగాం. న్యాయస్థానానికి వెళ్లాలని ఎస్ఈసీ మాకు సమాధానమిచ్చారు. దాడులకు దిగిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని అడిగాం. దువ్వాడపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి… అచ్చెన్నను మాత్రం అరెస్టు చేశారు. 2019 ఒటర్ల జాబితాను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీన్ని అమలు చేయాలని ఎస్ఈసీని కోరాం. అధికారులు వైసీపీ నేతల ఆదేశాల మేరకు కాకుండా చట్ట ప్రకారం పని చేయాలి. లేకపోతే సీఎం జగన్‌తో పాటు మరి కొంత మంది అధికారులు జైలుకు వెళ్తారు’ అని వ్యాఖ్యానించారు.బోండా ఉమా మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వైసీపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తున్న వైనాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. శ్రీకాకుళంలో పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎస్ఈసీని అడిగాం. గతంలో తామిచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం. అచ్చెన్న కేసు విషయమై దర్యాప్తు కోసం స్పెషల్ ఆఫీసర్‌ను శ్రీకాకుళం వెళ్లమని ఆదేశించినట్లు ఎస్ఈసీ మాకు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసు అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ, సీఐలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరాం.. సానుకూలంగా స్పందించారు. టీడీపీ విజ్ఞప్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరాం. దాడి చేసిన దువ్వాడ శ్రీనివాస్‌పై చిన్న కేసులు పెట్టి అచ్చెన్నాయుడుపై హత్యాయత్నం కేసులు పెట్టారు. ఎస్ఈసీపై గౌరవంతో మేనిఫెస్టోను విత్ డ్రా చేసుకున్నాం’ అని బోండా ఉమ తెలిపారు.
కన్నబాబుకు బెయిల్‌తో ఈ వ్యవహారం మరోమారు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికైనా సర్కారు ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also Read: అచ్చెన్న రాజ్యంలో అరాచకం : రౌడీషీటర్లు తప్ప ఇంకో దిక్కులేదా?