ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ .. సినిమాల లైనప్ చూస్తే మతిపోతుంది. అన్నీ పాన్ ఇండియా సినిమాలే. భారీ బట్జెడ్ తో బహుభాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి వీటిలో ‘ఆదిపురుష్’ సినిమాను దాదాపు రూ. 500కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. రామాయణ ఇతిహాస కావ్యం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ పౌరాణిక చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. పాన్ ఇండియా లెవెల్ కు తగ్గట్టుగానే.. సీతాదేవిగా బ్యూటీ కృతి సనన్ , రావణుడిగా సైఫ్ ఆలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ బాలీవుడ్ నుంచి ఎంపికయ్యారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల కానున్న ఆదిపురుష్ సినిమా 3డి టెక్నాలజీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు. హిందీలో సైతం విడుదల కాబోతోంది.
ఇక ‘ఆదిపురుష్’ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ ఎంపికయినట్టు తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. లంకేశ్వరుడు రావణుడి సోదరుడు విభీషణుడిగా సుదీప్ నటించబోతున్నాడట. సీతాదేవిని అపహరించడం చాలా తప్పని, ఇప్పటికైనా మించి పోయింది లేదని, సీతాదేవిని రాముడికి అప్పగించి.. ఆయన శరణువేడమని అన్నగారి చెవిలో ఇల్లుకట్టుకుని మరీ పోరుతాడు. దాన్ని రావణుడు ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా.. తన తమ్ముడ్ని ఇంటి నుంచి బైటికి గెంటేస్తాడు. దాంతో విభీషణుడు శ్రీరాముడి ఆశ్రయం పొందుతాడు. అప్పటి నుంచి రావణుడి గుట్టు మట్లన్ని రాముడికి చెప్పి.. అన్నగారి పతానానికి కారకుడవుతాడు. అలాంటి ఉదాత్తమైన పాత్రలో సుదీప్ నటిస్తుండడం విశేషంగా మారింది. మరి ఈ వార్తలోని నిజానిజాలేంటో చూడాలి.