ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్ చూస్తే మతిపోతుంది. క్రేజీ కాంబోస్ ను లైన్ గా సెట్ చేసుకుంటూ అభిమానులకు వరుసగా సర్ ప్రైజులిస్తున్నారు. వీటిలో రీమేక్ మూవీస్ కూడా ఉన్నాయి. కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ ‘పింక్’ బాలీవుడ్ మూవీకి రీమేక్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ మరో రీమేక్ మూవీకి కూడా కమిట్ అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఈ మధ్యనే వచ్చింది.
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కి రీమేక్ గా తెరకెక్కనున్న చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. దీనికి ‘అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ వెర్షన్ లో బిజు మీనన్ చేసిన అయ్యప్పన్ నాయర్ పాత్రను పోషించనుండగా.. కోషి పాత్ర కోసం రానాను అనుకున్నారు. అయితే రానాకి వేరే కమిట్ మెంట్స్ ఉండడంతో .. ఇప్పుడు మేకర్స్ కన్నడ హీరో సుదీప్ ను సంప్రదించారట.
ఒరిజినల్ వెర్షన్ లో పృధ్విరాజ్ సుకుమారన్ పోషించిన కోషి కురియన్ పాత్రకు సుదీప్ ఖచ్చితంగా సూట్ అవుతాడని భావిస్తున్నారట. అంతేకాదు సుదీప్ కు , పవర్ స్టార్ కు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి కూడా. పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను ‘రన్నా’ గా రీమేక్ చేసి హిట్టు కొట్టాడు సుదీప్ . అలాగే.. రీసెంట్ గా పవర్ స్టార్ ను కలిసిన అతడు ఆయనతో చాలా సేపు మాట్లాడాడు. మొత్తం మీద సుదీప్ పవర్ స్టార్ సినిమాకోసం మరోసారి టాలీవుడ్ లో అడుగుపెట్టనుండడం విశేషాన్ని సంతరించుకుంది. మరి పవర్ స్టార్ కు సుదీప్ .. ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా ఎంత గట్టి పోటీ ఇస్తాడో చూడాలి.