అక్కినేని వారసుడిగా సుమంత్ సినీ రంగ ప్రవేశం చేసినా కెరీర్ ఒక అడుగు ముందకు రెండు అడుగులు వెనక్కు వెళుతోంది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడూ మంచి సినిమాలు పలకరిస్తున్నా అది ఎక్కువ కాలం నిలవడం లేదు. తాజా థ్రిల్లర్ జోనర్ మీద దృష్టిపెట్టినట్టు అనిపిస్తోంది. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ‘కవలుధారి’ సినిమాను ‘కపటధారి’ రీమేక్ చేశారు. కపటధారి రివ్యూ. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సుమంత్ ఓ పరిశోధనాత్మక పాత్రను పోషించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదలైంది. సుమంత్ ఎలాంటి అనుభవాన్ని ఈ సినిమా ఇచ్చిందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఓ ట్రాఫిక్ ఎస్.ఐ. గౌతమ్ (సమంత్) క్రైమ్ డిపార్ట్ మెంట్ లోకి వెళ్లలేకపోయానన్న అసంతృప్తితో సాగా కథ ఇది. సినిమా ప్రారంభమే ఓ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ తో సాగే మర్డర్ తో ప్రారంభమవుతుంది. ఆ మర్డర్ కీ ఈ ట్రాఫిక్ ఎస్.ఐ.కీ ముడిపెట్టి ఈ కథను తెరకెక్కించారు. గౌతమ్ డ్యూటీ చేసే ప్రాంతాల్లో తవ్వకాల్లో మూడు అస్తి పంజరాలు బయటపడతాయి. అది ఏదో ప్రమాదంలో మరణించిన వారి శవాలుగా కేసు క్లోజ్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. గౌతమ్ ఈ కేసు మీద దృష్టి సారిస్తే ఎన్నో కొత్త విషయాలు బయటపడుతుంటాయి.
అది నలభై ఏళ్ల క్రితం చనిపోయిన ఓ కుటుంబానికి సంబంధించిన అస్తి పంజరాలుగా గుర్తిస్తాడు. ఈ పరిశోధనలో అతనికి జర్నలిస్టు జీకే (రాజశేఖర్), రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రంజిత్ (నాజర్) సహకరిస్తారు. ఈ క్రమంలోనే ఈకేసుతో సంబంధం ఉన్న సినీ నటి హత్య జరుగుతుంది. అలా కేసు పరిశోధించే కొద్దీ ఆలేరు శ్రీనివాస్ అనే రాజకీయ నాయకుడి దగ్గర కేసు ఆగుతుంది. చివరికి ఈ ట్రాఫిక్ ఎస్.ఐ. దీన్ని ఎలా ఛేదించాడు అన్నదే కథ.
Must Read ;- నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ ఎలా ఉండబోతోందో?
ఎలా తీశారు? ఎలా చేశారు?
గౌతమ్ గా సుమంత్ మెప్పించాడు. జీకేగా తమిళ నటుడు రాజశేఖర్, రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ గా నాజర్ లు కథ గ్రిప్పింగ్ గా కొనసాగేందుకు దోహదపడ్డారు. హీరోయిన్ నందిత, సినీ నటి రమ్య పాత్రలో సుమన్ రంగనాథ్ పాత్రలు నామ్ కే వాస్తే అన్నట్టు ఉంటాయి. ప్రధానంగా కథ మీదే దర్శకుడు దృష్టిపెట్టాడు. విలన్ గా కన్నడ నటుడు సతీష్ కుమార్ ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. దర్శకుడు ప్రదీప్ కథనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాకపోతే ఈ సినిమానూ పూర్తిగా రీమేక్ చేసినట్టు అనిపించదు.
అక్కడక్కడా సన్నివేశాలు అతికించినట్టుగా ఉంటుంది. డైలాగుల్లో లిప్ మూమెంట్ కొన్ని చోట్ల సింక్ కాలేదు. కేసు పరిశోథన చేసేటప్పడు కథ అర్థం కావడానికి ఆ పాత్రలతోనే చెప్పించడం కొత్తగా అనిపించింది. కాకపోతే కొంత గందరగోళంగానూ ఉంది. ప్రధానంగా రీరికార్డింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. థ్రిల్లర్ కథ కాబట్టి ఆ ఫీల్ రావడంలో దర్శకుడు మంచి ఎఫర్ట్ పెట్టాడు. మూల కథను తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి కొన్ని కమర్షియల్ అంశాలు చేరిస్తే సినిమా మరో మెట్టు పైన ఉండేది. ముగింపు విషయంలో కూడా దర్శకుడు ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.
కపటధారి రివ్యూ :
నటీనటులు : సుమంత్, నందిత, సుమన్ రంగనాథ్, నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్, రాజశేఖర్, సతీష్ కుమార్ తదితరులు
సంగీతం : సిమన్ కె కింగ్
సినిమాటోగ్రఫీ : రసమతి
ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్
నిర్మాణం : క్రియేటివ్ ఎంటర్‌టైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్
నిర్మాతలు : ధనంజయన్, లలితా ధనంజయన్
దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి
విడుదల తేదీ : ఫిబ్రవరి 19
ఒక్క మాటలో: మర్డర్ మిస్టరీకి న్యాయం
రేటింగ్: 2.25/5
– హేమసుందర్ పామర్తి