గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నాయకులు ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల అధిష్టాలను ప్రసన్నం చేసుకునేందుకు రూట్‌లు వెతుక్కుంటున్నారు. ఇక అధికార పార్టీలో మంత్రులుగా ఉన్న వారు తమ వారసులను గ్రేటర్ ఎన్నికల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందితే ఎమ్మెల్యే స్థాయి వచ్చినట్టే అని బావిస్తుంటారు చాలా మంది నాయకులు. సాధారణంగా గ్రేటర్‌లో అధికార పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలుంటాయి కాబట్టి ఆ పార్టీ టికెట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అధినేత దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతుంటారు.
రాజేంద్రనగర్‌లో పాగా కోసం…
టీఆర్ఎస్‌లో కీలక నేత, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఓటమే స్వాగతించింది. 2014 ఎన్నికల్లో తన తల్లిని కాదని తనకే టికెట్ ఇప్పించుకున్నాడు. చేవెళ్ళ ఎంపీగా ఆయన పోటీ చేసి ఓడిపోయారు . దీంతో ఆయన ప్రత్యక్ష రాజాకీయాల్లోకి ఇప్పటి వరకు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన తల్లి మరోసారి గెలుపొంది టీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో టీఆర్ఎస్ అధినేతకు చేరువయ్యారు సబితా కుటుంబ సభ్యులు. దీంతో ఆ కుటుంబం ఎప్పటి నుండో కన్నేసిన రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. రెండు సార్లుగా ప్రకాష్ గౌడ్ గెలుపొందుతూ వస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో అయినా ఆ స్థానం నుండి పోటీ చేయాలని కార్తిక్ రెడ్డి భావిస్తున్నారు. అయితే ప్రకాశ్ గౌడ్ సిట్టింగ్‌గా ఉన్న నేపథ్యంలో ఆయన ఆశలు అంత ఈజీగా ఫలించేలా కనిపించడం లేదు. నియోజకవర్గాల పునర్వవస్థీకరణ జరిగితేనే ఆయనకు నేరుగా ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు ఉంటాయి. అలా కాదంటే ప్రకాశ్ గౌడ్‌ను కాదని కార్తిక్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ.
కార్తిక్ రెడ్డి భార్య గ్రేటర్ బరిలో..
రాజేంద్రనగర్‌లో పోటీ చేసేందుకు అవకాశం వస్తుందో లేదో అన్న భావనలో ఉన్న కార్తిక్ రెడ్డి తన భార్యను గ్రేటర్ బరిలో నిలిపేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ నుండి తన భార్యను కార్పోరేటర్‌గా బరిలో దింపాలని భావిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో టికెట్ సాధించడం అంత కష్టమేమీ కాదన్న అభిప్రాయముంది. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్‌కు చెందిన వ్యక్తే కార్పోరేటర్‌గా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేకు పోటీ చేసి టీఆర్ఎస్‌కు దూరం కావడంతో కార్తిక్ రెడ్డి ఆ స్థానాన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఈ స్థానంలో పోటీ చేస్తే గెలుపు కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదని , గెలిస్తే ఆ ప్రాంత ప్రజలకు చేరువ కావచ్చని ఆయన భావిస్తున్నారు. మొత్తానికి ఎంపీగా తాను గెలవ లేక పోయినా తన భార్యను గ్రేటర్ బరిలో దింపి రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్‌ను అటునుంచి బలపరుచుకునే పనిలో ఉన్న కార్తిక్ రెడ్డి ఆశలు ఏమేరకు నెరవేరతాయో చూడాలి.