విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య వివాదం ఫైనల్ స్టేజ్‌కు చేరింది. వీరి వివాదంపై పార్టీ అధినేత చంద్రబాబు తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే క్రమశిక్షణా కమిటీ కేశినేనిని, కొలికపూడిని పిలిచి మాట్లాడింది. వారి వాదనలు విని.. పార్టీ పరంగా ఓ నివేదిక కూడా రెడీ చేశారు. వాటిని చంద్రబాబుకు అప్పగించారు. ఇప్పుడు చంద్రబాబు ఆ నివేదికల్ని పరిశీలించి తీర్పు చెప్పనున్నారు.
కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల్లోనే దారి తప్పారని క్రమశిక్షణా కమిటీ గుర్తించింది. కొలికపూడికి సంబంధించి ఈ వివాదం మొదటిది కాదు. ఆయన గెలిచిన నాటి నుంచి ఏదో ఓ వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. తెలుగుదేశం క్యాడర్‌ను ఓన్ చేసుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని క్రమశిక్షణా కమిటీ నివేదికలో పేర్కొంది.
కేశినేని చిన్ని తన నియోజకవర్గానికి మరో లీడర్‌ను తెచ్చిపెడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని ప్రచారం చేస్తున్నారని కొలికపూడి క్రమశిక్షణా కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సమాచారం.
కేశినేని మాత్రం..తాను పార్టీ కోసమే పని చేస్తున్నానని, కొలికపూడితో తనకు ఎలాంటి వివాదం లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీపైనా, కొలికపూడిపైనా తాను బహిరంగంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.ఈ విషయంపై చంద్రబాబునాయుడు ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు. కొలికపూడిపైనే చర్యలకు క్రమశిక్షణా కమిటీ సూచన చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది











