తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ కవిత సంఘం ఎన్నికల్లో పాల్గొననున్నారు. ప్రస్తుతం కవిత ఆ సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు జరుగుతున్నందున కవిత అధ్వర్యంలోని సంఘం గెలుస్తుందా? లేకపోతే ఇతర సంఘం గెలుస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో అధికారం పోతుందని ఊహించని కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు వివిధ వర్గాల్లో తమ పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత కోల్ బెల్ట్ లో రాజకీయాలు చేస్తున్నారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం ఓడిపోతే ఇంకా గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఆ అనుబంధ సంఘం ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పటి నుండి కవిత కనుసన్నల్లోనే నడుస్తోంది.
వాస్తవానికి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే జరగాలి ఉంది. అయితే కోర్టుకెళ్లి వాయిదా వేయించుకున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడటంతో కవిత.. టీబీజీకేఎస్ సంఘం నాయకులు, ముఖ్య కార్యకర్తలను హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడినట్టు తెలుస్తోంది. అధికారం పోయింది కాబట్టి ఇప్పుడేమీ హామీలు ఇస్తారని.. అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయలేదనే కార్మికుల అసంతృప్తి ఇప్పుడు కవితకు మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డిపెండెంట్ ఉద్యోగాల కోసం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీవ్రంగా కృషి చేశారని .. కానీ కొంత మంది కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. అధికారులు కుదరదని చెప్పినా సరే కేసీఆర్ నిబంధనలను సవరించి వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేలా చేశారని కవిత చెబుతున్నారు. సింగరేణి సంస్థలో దాదాపు 40 వేల ఉద్యోగులు ఉన్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అన్నీ చేస్తామని హామీలు ఇచ్చి.. వరుసగా గెలుస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పోయింది కాబట్టి.. పోరాటం చేస్తామని మాత్రమే బీఆర్ఎస్ హామీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేసి అమలు చేస్తామని కవిత పేర్కొంటున్నారు . మేనిఫెస్టోపై నమ్మకం పెట్టుకుని బీఆర్ఎస్కు పట్టం కడతారా? లేకపోతే వేరే సంఘానికి విజయం అందిస్తారా? అనేది ఎన్నికలు జరిగే వరకు వేచి చూడాల్సి ఉంది.