హైదరాబాద్‌లో అత్యంత రద్దీ ప్రాంతమైన KBR పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఎన్నో దశాబ్దాల అనుబంధం, అంతులేని జ్ఞాపకాలు ముడిపడి ఉన్న తన స్వగృహాన్ని, విలువైన స్థలాన్ని ఎలాంటి నష్టపరిహారం ఆశించకుండా కేవలం ట్రాన్స్పరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పైనే ప్రభుత్వానికి అందించేందుకు ఆయన ముందుకొచ్చారు.
బాలకృష్ణ రోడ్డు విస్తరణ నిమిత్తం ఇస్తున్న ఈ స్థలం మరియు ఇల్లు గజం ఏకంగా రూ.45 లక్షల వరకు పలుకుతున్న అత్యంత ఖరీదైన, వ్యాపారపరంగా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతంలో ఉంది. నందమూరి తారకరామారావు స్వయంగా తన కుమారుడైన బాలకృష్ణ కోసం 1982లో ఈ ఇంటిని నిర్మించి ఇచ్చారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా బాలకృష్ణ ఇదే నివాసంలో ఉంటున్నారు. నందమూరి కుటుంబానికి సంబంధించిన ప్రతి వేడుకకూ ఈ ఇల్లే ప్రధాన వేదిక. అంతేకాదు, ఎన్టీఆర్ గారు స్వయంగా తన అభిమానులను ఈ ఇంట్లోనే ఆప్యాయంగా కలిసేవారు. ఒక తండ్రి ప్రేమకు, కుటుంబ చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక భవనంతో బాలకృష్ణకు విడదీయరాని భావోద్వేగ అనుబంధం ఉంది.
అయినప్పటికీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే లక్షలాది మంది ప్రజల ప్రయాణ సౌలభ్యం, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు వంటి ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని భావించి..ఈ త్యాగానికి ఆయన సంపూర్ణంగా అంగీకరించారు. ప్రస్తుత రోడ్డు విస్తరణ పనుల కారణంగా బాలకృష్ణ నివాసంలోని ఒక భవనం సగానికి పైగా కోల్పోవాల్సి వస్తోంది. దీంతో ఆయన అనివార్యంగా ఈ చారిత్రక నివాసం నుంచి వేరే ప్రాంతానికి మకాం మార్చాల్సి వస్తోంది.
KBR పార్కు చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం విజయవంతం కావడంతో, దీన్ని శాశ్వతంగా అమలుచేసేందుకు GHMC రంగంలోకి దిగింది. ముఫఖంజా కాలేజీ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రూ.1,090 కోట్ల వ్యయంతో 4.3 కిలోమీటర్ల మేರೆ చేపట్టిన 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ కారిడార్‌తో 5 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లలో వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ప్రయాణం వేగవంతం కానుంది. ఒకవేళ ఎలివేటెడ్ కారిడార్ కాకుండా కేవలం రోడ్ల విస్తరణే చేపట్టి ఉంటే, కేవలం ప్రైవేట్ ఆస్తుల సేకరణకే సుమారు రూ.1,000 కోట్లు వెచ్చించాల్సి వచ్చేది.
ఈ విస్తరణలో భాగంగానే బాలకృష్ణ నివాసంతో పాటు, KBR ఎంట్రన్స్ జంక్షన్ వద్ద శబ్దాలయ స్టూడియోకు చెందిన 608 చదరపు గజాల స్థలాన్ని ఫ్రీ-లెఫ్ట్ రోడ్డు కోసం సేకరిస్తున్నారు. దీనివల్ల స్టూడియో ప్రహరీ గోడ పూర్తిగా తొలగిపోయి ప్రధాన భవనం వరకు పనులు చేరుకున్నాయి. అలాగే ఫిల్మ్ నగర్ జంక్షన్‌ను అనుసంధానించే క్రమంలో భవ్య కన్స్ట్రక్షన్స్కు చెందిన సుమారు 34,133 చదరపు గజాల స్థలాన్ని తీసుకోవడం వల్ల ఆ సంస్థ భవనం పూర్తిగా తొలగిపోనుంది. ఈ ప్రముఖులందరూ ఎలాంటి నగదు పరిహారం తీసుకోకుండా టీడీఆర్లకే తమ భూములను అప్పగించడం విశేషం. ఎన్టీఆర్ ఆశీస్సులు, జ్ఞాపకాలు నిండిన తమ ఇంటిని సైతం ప్రజల సౌలభ్యం కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.











