తెలంగాణలో రోజు రోజుకు పడిపోతున్న గ్రాఫ్‌ను పెంచుకునేందుకు టీఆర్ఎస్ టాప్ బాస్‌లు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీకి పాత ఊపు తీసుకువచ్చేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. తాము నమ్ముకున్న ఉద్యమ సిద్ధాంతాలున్న వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు ఉద్యమ కారులతో ఈ మేరకు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో అదరినీ కలుపుకు వెళ్ళిన కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక ఒక్కొక్కరూ ఆయనను వీడారు. వెళ్తున్న వారిని ఆపే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. వీలైతే పొగపెట్టి కొంతమందిని తనకు దూరంగా పంపించి వేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో కేసీఆర్‌పై ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. సొంత పార్టీలో ఉన్నవారు, మంత్రులు సైతం ఆయన వైఖరికి వ్యతిరేకంగా ఎదో ఓ రకంగా నోరు విప్పిన వారే . దీంతో ఆ తరువాత వారితో చర్చలు జరిపి వివాదం ముదరకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరితో అయినా కేసీఆర్ మాట్లాడితే వారు కన్వెన్స్ అవ్వడం ఖాయం అంటారు ఆయనను క్లోజ్‌గా చూసిన ఎవరైనా.
బీజేపీని ఎదగనివ్వకుండా చూడటమే లక్ష్యం..
తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువగా టీఆర్ఎస్‌కు బీజేపీ త్రెట్‌గా మారింది. ఇప్పటికే దుబ్బాకలో టీఆర్ఎస్‌ను ఓడించి తొలిదెబ్బ కొట్టింది బీజేపీ. గ్రేటర్ ఎన్నికల్లోనూ చావుదెబ్బ కొట్టింది . దీంతో బీజేపీకి మరింత అవకాశం ఇస్తే తనకు, తన పార్టీకి ముప్పు తప్పదని భావిస్తున్న కేసీఆర్ పాత అస్త్రాలను బయటకు తీస్తున్నారు. ఉద్యమ కారులను దువ్వే ప్రయత్నాలు మొదలు పెట్టారని పార్టీలో చర్చ సాగుతోంది. బలపడితే బీజేపీని తట్టుకోవడం కష్టం అని.. కాంగ్రెస్ బలపడినా ప్రమాదం లేదని, బీజేపీ రాష్ట్రంలో బలపడితే అందరికీ ఇబ్బందులు తప్పవన్న ప్రచారం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా కేసీఆర్ ఫాం హౌజ్ నుండి బయటకు రావడం లేదు. గ్రేటర్ ఫలితాల తరువాత కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చారు. ఆ సమయంలో ఆయన వ్యవహార శైలిపై విపక్ష పార్టీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు సైతం ఢిల్లీలో ఏఏ అంశాలు చర్చించారో బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు. అయినా కేసీఆర్ నోరు మెదపలేదు. పదిహేను రోజుల తరువాత గత రెండు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తున్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నామన్న సంకేతం ఇస్తూనే మరోపక్క బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకు వ్యవసాయ చట్టంపై కేసీఆర్ యూ టర్న్ నిదర్శనం అంటున్నారు రాజకీయ నిపుణులు.
ఉద్యమ నాయకులతో చర్చల్లో కేటీఆర్ ..
గతంలో కేసీఆర్‌తో విభేదించి పార్టీ నుండి బయటకు వచ్చిన వారు మరోసారి కేసీఆర్‌ను నమ్ముతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేటీఆర్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్న కేసీఆర్‌కు కేటీఆర్ తన వంతు సాయం చేస్తున్నట్టు చెబుతున్నారు పార్టీ నేతలు. ఉద్యమ సమయంలో కీలకంగా ఉండి ఆ తరువాత కనుమరుగైన వారందరినీ తండ్రీకొడుకులు సంప్రదింపులు చేస్తున్నారని…. ఇప్పటికే కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండి టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఓ కీలక నేతతో నేరుగా కేసీఆర్ , కేటీఆర్‌లు మాట్లాడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన నిర్ణయం మాత్రం ఇప్పటి వరకు వెళ్ళడించ లేదంటున్నారు. కేసీఆర్ , కేటీఆర్‌లు చేస్తున్న ఓల్డ్ ఈజ్ గోల్డ్ పార్ములా ఏ మేరకు వర్కౌట్ అవుతుంది.. ఇన్నాళ్ళూ దూరం పెట్టిన నేతలను కష్టాల్లో ఉన్న సమయంలో సంప్రదిస్తే వారు పార్టీ కోసం పని చేస్తారా లేదా అన్నది చూడాలి.