ప్రభుత్వ చేయూత కోసం తెలుగు సినీ పరిశ్రమ ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి దీనిపై ఓ ప్రకటన చేయడం శుభపరిణామంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సినీ పరిశ్రమను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురితో సీఎం కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటోందనే విషయాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు.
Also Read:-cm kcr with chiranjeevi and nagarjuna
పరిశ్రమకు, సినీ కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోడానికి రాయితీలు ఇస్తామని ప్రకటించారు. ‘దేశంలో ముంబై, చెన్నైతోపాటు హైదరాబాద్ లోనే పరిశ్రమ పెద్ద స్థాయిలో ఉందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇటు ప్రభుత్వం, అటు సినీ పెద్దలు కలిసి ఆదుకోడానికి అన్ని చర్యలూ తీసుకుంటాం’ అని సీఎం వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను పేర్కొంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.
Also Read:-హీరోలు అడిగింది గోరంత.. కేసీఆర్ ఇచ్చింది కొండంత?
ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా త్వరగా తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడ్దారు. ఇప్పటికే చాలా ఆలాస్యమైందని, ఎంతోమంది తమ సొంతూళ్లకు తరలిపోయారని, పరిశ్రమకు ఇంతకుముందున్న వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని కోరుతున్నారు. ఇంతకుముందు కరోనా క్రైసిస్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా సినీ కార్మికులను ఆదుకున్నారు. ఇక షూటింగులు కొనసాగడానికి నిబంధనలు సడలించడం, ఎగ్జిబిట్లరకు విద్యుత్ రాయితీ ఇవ్వడం, 50 శాతం సీటింగ్ నిబంధనల్లో సడలింపులు లాంటి మరి కొన్ని డిమాండ్లను సినీ పరిశ్రమ తరఫున ప్రభుత్వాలను అడుగుతున్నారు.
ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమై అనేక విషయాలను చర్చించారు. మరోసారి చర్చించి నిర్ణయాలు తీసుకోడానికి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్షకార్యదర్శులు నారాయణదాస్ నారంగ్, దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి. కళ్యాణ్ తదితరులు ఉన్నారు. త్వరలోనే మరో సమావేశం చిరంజీవి సమక్షంలో జరిగే అవకాశం ఉంది.