కేంద్రంతో యుద్ధం చేస్తామని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే కేసీఆర్ స్వరంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సంచలంగా మారుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు కారణమో లేక బీజేపీతో వివాదం కంటే సఖ్యతే మేలు అనే ఉద్దేశమో తెలియదు కాని.. గత వైఖరికి భిన్నంగా కేసీఆర్ వెంటవెంటనే నిర్ణయాలు తీసుకోవడమే అసలు చర్చకు కారణమైంది. మొన్నటికి మొన్న ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో భాగంగా జరిగిన భారత్ బంద్‌కు తెలంగాణలో టీఆర్ఎస్ నాయకత్వం వహించింది. తరువాత కొన్ని రోజులకే ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. కేంద్రంలో ప్రధానితో పాటు పలువురితో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల దీక్ష వద్దకు వెళ్తారని భావించినా అది జరగలేదు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనంతరం రాజకీయపరమైన అంశం పరిశీలిస్తే.. యుద్ధ నినాదం నుంచి క్రమేణా శాంతి మార్గం వైపు పయనిస్తున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ పలు విమర్శలు చేస్తున్నా.. టీఆర్ఎస్ కొంత స్పీడు తగ్గించింది. సోషల్ మీడియాలోనూ అదే పరిస్థితి. పాలనాపరమైన విషయానికి వస్తే.. ఎల్ ఆర్ ఎస్‌లో మార్పులకు ప్రభుత్వం అంగీకరించడం, నియంత్రిత సాగు నుంచి కొంత వెనక్కి తగ్గడం, తాజాగా కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ వైద్య పథకాన్ని కూడా తెలంగాణలో అమలు చేసేందుకు సిద్ధం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
రెండేళ్లకు అంగీకారం..
కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబరు 23న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మొదలు పెట్టింది. రూ.2లక్షల వరకు దారిద్య్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికే తమ రాష్ట్రంలో అంతకంటే మంచి పథకం ఆరోగ్యశ్రీ ఉందన చెబుతూ కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తాము అమలు చేసే ప్రసక్తి లేదని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న టైంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ చాలా మంచిదని, మంచి పనులు ఎవరు చేసినా తాము కీర్తిస్తామని, అందుకే వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పేరు మార్చలేదని గతంలో అసెంబ్లీలోనే మాట్లాడారు కేసీఆర్. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి రాష్ట్రంలోని 79 లక్షల కుటుంబాలు వస్తుండగా, ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి కేవలం 20 లక్షల కుటుంబాలే వస్తాయని కూడా అధికార పార్టీ నాయకులు గతంలో ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్‌లో రూ.2లక్షల వరకు చికిత్స మాత్రమే ఉందని, ఆరోగ్యశ్రీలో రూ.5లక్షల వరకు ఉచిత చికిత్సలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 923 జబ్బులకు చికిత్స అందిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్‌లో ఇన్ని జబ్బులకు చికిత్సలు లేవని, ఇక ఆరోగ్యశ్రీలో కిడ్నీ, లివర్, బోన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటివి చేయడంతో పాటు జీవితకాలం మందులు ఉచితమని ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కోసం తెలంగాణ సర్కారు ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే.. ఆయుష్మాన్ భారత్ బడ్జెట్ కూడా తక్కువేనని గతంలో చెప్పారు.
ఆరోగ్యశ్రీ సాఫ్ట్ వేర్ తీసుకుని..
వాస్తవానికి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం ప్రారంభించే క్రమంలో తెలంగాణ, చత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న వైద్య పథకాలపై సమాచారం కోరింది. రాష్ట్ర విభజన తరువాత ఆరోగ్యశ్రీ పథకం అమలు, విధానాలు, సాప్ట్ వేర్‌లో తెలంగాణ ప్రభుత్వం అప్పటికే పలు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆరోగ్యశ్రీ సాఫ్ట్ వేర్ మోడల్‌ను ఎంపిక చేసింది. విధానాల రూపకల్పన తరువాత కేంద్రం ఆయుష్మాన్ భారత్ పేరుతో పథకం ప్రవేశ పెట్టింది. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్నా.. తెలంగాణలో అమలు కావడం లేదు. దీనిపై టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లుగా విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారాంశాలుగా కూడా మారాయి. అయితే ఇన్నాళ్ల వివాదం తరువాత ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు రాష్ట్రం సిద్ధమైంది. అయితే, ఆరోగ్యశ్రీ కూడ అమల్లో ఉంటుందని చెబుతున్నారు. రూ.2లక్షల లోపు చికిత్సలకు కేంద్ర పథకం, ఆ పైన రూ5లక్షల్లోపు చికిత్స ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబుతున్నారు. దీనిపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇక దేశంలో ఎక్కడివారైనా సంబంధిత గుర్తింపు కార్డులతో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వీలుండడం స్థానికేతరులకు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వారికి కొంత ఊరట లభించనుంది.
పేదలకు లబ్ధి చేకూరిస్తే..
పేదలకు, అర్హులకు లబ్ధి చేకూర్చే విషయంలో తీసుకున్న ఎలాంటి నిర్ణయాన్నయినా స్వాగతించవచ్చు. అయితే కేసీఆర్ సర్కారు ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు గత వైఖరికి భిన్నంగా ఉండడం, మోడీతో యుద్ధం చేస్తామని ప్రకటించిన కొన్నాళ్లకే మెత్తబడడంపై రాజకీయంగా చర్చ నడుస్తోంది. మరోవైపు దీనిపై టీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతూ.. కేంద్ర పథకం అమలు వల్ల రాష్ట్రానికి ఏటా కొన్ని నిధులు (రూ.200కోట్లకు పైగా) వచ్చే అవకాశం ఉండడంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా లబ్ది పొందుతారని చెబుతున్నారు. కేసీఆర్ మొదటి ప్రాధాన్యం బంగారు తెలంగాణకే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ..ఇన్నాళ్లు ఈ పథకం అమలు చేయలేదని, పేదలకు అన్యాయం చేశారని, కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.