నరేంద్ర మోదీ, అమిత్ షా లు కేసీఆర్‌కి ఏ హర్రర్ సినిమా ఎన్ని పార్టులు చూపించారో తెలియదు గాని.. గులాబీ బాస్ మాత్రం పూర్తిగా సరెండర్ అయిపోయినట్లు అర్ధమవుతోంది. పరిస్ధితి బాగోనప్పుడు లొంగిపోవడం ఆయనకు అలవాటే.. మళ్లీ తలెగరేయడం కూడా అలవాటే. కాని ఇప్పుడు మాత్రం అన్నినిర్ణయాలు ఆ దిశగానే జరుగుతున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ మేయర్ విషయంలో మాట్లాడదామని అడిగినా.. అసలు అపాయింట్‌మెంట్ కూడ ఇవ్వడం లేదంట.
వీడిన పట్టుదల..
మొన్నటి దాకా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్‌లు ఎందుకివ్వాలన్న మనిషే.. తయారు చేసి పంపించమని అధికారులకు చెప్పారు. ధరణి విషయంలోనూ మొండి పట్టుదల చూపించిన ఈ పెద్దమనిషి.. ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఫాలో అవ్వమని చెప్పేశారు.. పైగా సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచన వచ్చినా.. వద్దని చెప్పేశారు. వీటన్నిటిని మించి ఆయన సొంత మీడియా వారికి బీజేపీకి గాని, మోదీ గారికి గాని వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు, వ్యాఖ్యానాలు చేయకండి నాయనా అని ఆదేశాలిచ్చాడంట. అదీ పరిస్ధితి.
బీజేపీని నొప్పించకుండా..
ఇక గ్రేటర్ హైదరాబాద్ మేయర్ వ్యవహారంలోనూ బీజేపీని నొప్పించకుండా పని పూర్తి చేసుకోవాలన్న వ్యూహంలోనే గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు 56 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ మేయర్ పదవి విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటే.. మళ్లీ కమలం చేతిలో లడ్డూ పెట్టినట్లే.. అందుకే ఆ సాహసం మాత్రం ఈసారికి చేయదల్చుకోలేదు.
మున్సిపల్ చట్టంలో ఓ మార్పు ?
ఇప్పటికే మున్సిపల్ చట్టంలో ఓ మార్పు చేసేశారని చెబుతున్నారు. అదేంటంటే.. మెజారిటీ స్థానాలు ఎవరికుంటే వారిదే మేయర్.. అంతేగాని సగం పైనా ఉండాలనే కండిషన్ లేదంట. ఆ పేరు చెప్పి.. టీఆర్ఎస్ మేయర్ స్థానాన్ని తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం.. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీని కమిషనర్ పిలుస్తారు. వారికే అప్పచెప్పి.. కౌన్సిల్‌లో ఓటింగ్ నిర్వహిస్తారు. అప్పుడు గులాబీ పార్టీకి ఎక్కువ మంది సభ్యులు మద్దతు ఇవ్వగానే.. వారికే మేయర్ అని అనౌన్స్ చేసేస్తారు. ఈ ప్రాసెస్‌లో ఎక్కడా ఎంఐఎం మద్దతు తీసుకోవాల్సిన అవసరమే రాదు. అలా చేస్తే ఇక సేఫ్ అనేది ఆయన ప్లాన్.
అధికారం పోకుండా.. కమలానికి నొప్పి లేకుండా
అలా కమలం పార్టీ ప్రమాదాన్ని గుర్తిస్తూనే.. దానికి ఎదురు తిరిగితే వచ్చే ప్రమాదాన్ని కూడా బాగా గుర్తించి.. ఇటు తన అధికారం పోకుండా.. అటు కమలానికి నొప్పి లేకుండా ఏం చేయాలో అవన్నీ ఇప్పుడు చేసే పనిలో కేసీఆర్ బిజీ అయిపోయారు. అయితే, కమలనాథుల వ్యూహాలన్నీ ఇతర పార్టీలు స్నేహితులైనా సరే.. తొక్కేయడమే పని. శివసేన వ్యవహారంలోనూ.. అకాలీదళ్ వ్యవహారంలోనూ.. అన్నిటిలోనూ అదే ఒరవడి చూపించారు. రేపు కేసీఆర్‌కి సైతం ఊ కొడుతూనే ఊదేస్తారనడంలో సందేహం లేదు
Must Read ;- గడువెంతో ఉంది.. గ్రేటర్ మేయర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ