కేసిఆర్ ఎప్పడు ఎలా మాట్లాడుతారో ఎవ్వరికీ అర్థం కాదు. తన రాజకీయ ప్రసంగాల్లో ఆయన మాట్లాడే విధానం ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. యాస.. భాషతో ఓటర్లను ఇట్టే ఆకట్టుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. తను ఏం చెప్పదల్చుకున్నాడో అది సూటిగా కుండ బద్దలు కొడుతూ, ప్రతిపక్షాలపై చురకలు వేస్తూ బాణాలు సంధిస్తుంటారు. ఆయన చెప్పే మాటమీద నిలబడతాడా? లేదా అనేది వేరే విషయం. అయితే కెసిఆర్ చేసే ప్రసంగాలకు కొందరు ఫిదా అయితే.. మరికొందరు ఆయన చేసే ప్రసంగాలు, వాగ్దానాలను విమర్శించేవారూ ఉన్నారు. పూటకో మాట.. రోజుకో బాట అన్నట్లుగా తన మాటలుంటాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా చెప్పే వారి మాటల్లోనూ అర్థం లేకపోలేదు.
ఎందుకంటే 2009లో టిఆర్ఎస్ పార్టీ మహాకూటమితో పోటీ చేసింది. ఎన్నికలే ముగిశాయి..ఇంకా ఫలితాలు కూడా రాలేదు. ఫలితాలొచ్చే లోపే బిజెపికి మద్దతుపై చర్చలు జరిపిందనే ఆరోపణలు గులాబీ బాస్‌పైన ఉన్నాయి. దీంతోపాటు 2014, దానికి ముందు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చిదంబరం ప్రకటన చేశారు. ఆ ప్రకటనను తప్పుబడుతూ రాత్రికి రాత్రే రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రకటన ఎలా చేస్తారనే అంశంపై రగడ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే టిఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానంటూ ఆ నాడు ప్రకటించారు. కొన్ని పరిణామాల తరువాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కానీ పార్టీని మాత్రం కాంగ్రెస్‌లో విలీనం చేయలేదు.
అలాగే 2019లో దేశ రాజకీయాల్లో వెళ్తున్నట్లు గులాబీ బాస్ సంకేతాలను ఇచ్చారు. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ఇతర పార్టీలను కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు హంగూ ఆర్భాటం చేశారు. తమిళనాడుకెళ్ళి కరుణా నిధి వారసులను కలవడంతో పాటూ ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులతో నేరుగా వెళ్లి కలవడం, ఫోనులో అప్పుడప్పుడు సంభాషించడం మనం చూశాం. అప్పట్లో అందరూ కూడా నిజంగానే కెసిఆర్…ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశరాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నరా? అనే ప్రశ్నలు అందరి మదిలో మెదిలాయి. కానీ ఇప్పటి వరకు ఆ ఫ్రంట్ విషయం ఎటూ తేల్చలేదు.
నయాభారత్ అంటూ కొత్త రాగం!
ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు మరో కొత్త రాగం వినబడుతోంది. అదే నయా భారత్. జాతీయపార్టీని కెసిఆర్ పెట్టబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. కొన్ని వార్తా పత్రికల్లో దీనికి సంబంధించిన వార్తా కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. కానీ తాను ఏ సార్టీ పెట్టడంలేదని కెసిఆర్ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. ఏదైనా పార్టీ పెట్టదల్చుకుంటే ముందస్తుగా అందరికీ తెలియజేస్తానని చెప్పినట్లు తెలిసింది.
అయినా రాష్ట్రంలో ఇంకా నాలుగేళ్ల పాలన ఉండగానే ఇక్కడ అంతా వదిలేసి దేశరాజకీయాలకు అప్పుడే ఎలా వెళతారు అనేది మరో ప్రశ్నగా నిలిచింది. మరోపక్క రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగమే నయాభారత్, కొత్త జాతీయపార్టీ లాంటి ఎత్తుగడలని గులాబీ బాస్ తెరపైకి తీసుకొస్తున్నట్లుగా మనం భావించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.