జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ..గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నుంచి వస్తున్నారని ప్రచారం చేశారు. ఆ ఫలితాల్లో టీఆర్ఎస్కు నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. అప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో దెబ్బతిన్న టీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత నిరాశ కలిగించాయి. తరువాత కూడా రెండు పక్షాల మధ్య వాగ్యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటే..కేసీఆర్ ఢిల్లీ పర్యటన, వెంటనే రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గల్లీ ఎన్నికల ఎఫెక్ట్.. ఢిల్లీలో పాలిటిక్స్ అనే చర్చ మొదలైంది.
ఇక కేసీఆర్ టూర్ విషయంలో..రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, తెలంగాణలో విమానాశ్రయాల మంజూరు, వరదలతో సంభవించిన నష్టపరిహారం నిధుల విడుదలపై ప్రధానితోపాటు పలువురితో చర్చించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మేయర్ పదవులపైనా చర్చ జరిగిందా..?
అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మేయర్ పదవి, డిప్యూటీ మేయర్ పదవి అంశంపై కూడ చర్చ జరిగిందనే ప్రచారం కూడా నడుస్తోంది. మరోవైపు కొన్ని మీడియాల్లో వేర్వేరు కథనాలు కూడా వస్తున్నాయి. కొందరు నాయకుల ఖాతాల్లోకి ఓ కాంట్రాక్టర్ మధ్య భారీ లావాదేవీలు, బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్‌కి హైదరాబాద్ నుంచి ఆర్థిక సాయం అందిందన్న సమాచారం కేంద్ర హోంశాఖ, ఈడీకి చేరాయన్న ఆరోపణలు కూడా మీడియాలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి. ఒకవేళ జీహెచ్ఎంసీ ఫలితాలు వచ్చాక..బీజేపీతో పొత్తు అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంటే.. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన బంద్‌కి కేసీఆర్ ఎందుకు మద్దతిస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
పొత్తుపై భిన్నాభిప్రాయాలు..
జీహెచ్ఎంసీపై లేదా త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పొత్తు అంశంపై చర్చను పరిశీలిస్తే.. ఇద్దరు రాజకీయ వ్యూహకర్తల ఎత్తుకు పై ఎత్తుగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రానున్న కాలంలో ఏ సందర్భంలోనైనా, ఏ అంశంలోనైనా బీజేపీ –టీఆర్ఎస్ నేరుగా పొత్తు పెట్టుకుంటే..ఇన్నాళ్లు బీజేపీ శ్రేణులు చేసిన ప్రయత్నం అంతా ఎటూ కాకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే రాజకీయంగా కత్తులు దూసుకున్న పార్టీలు పొత్తు పెట్టుకోవాలంటే..ఏదైనా బలమైన కారణం ఉండాలి. కాని రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీలు రెండూ అధికార పార్టీలే. నిధుల పంపిణీ, ప్రాజెక్టుల కేటాయింపు, పాలనలో సమన్వయం అంశాలు తప్ప.. ఆ రెండూ పూర్తి స్థాయిలో పొత్తు పెట్టుకునే బలమైన కారణాలే లేవు. ఒక వేళ పొత్తు పెట్టుకుంటే..అది టీఆర్ఎస్కు ఎంత ప్లస్ పాయింట్ అవుతుందో…అంతే నష్టం బీజేపీకి ఉంటుంది. అదే టైంలో ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే విమర్శిస్తున్న కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్లు అవుతుంది. మరి బీజేపీ..తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకుంటుందా… రాజకీయ చాణక్యులుగా పేరున్న మోడీ-షా ద్వయం అలా చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక, గతంలో తెలంగాణ ఇచ్చిన సమయంలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ను విలీనం చేస్తానని ఢీల్లీలో సోనియాగాంధీ దగ్గర చెప్పిన కేసీఆర్..హైదరాబాద్ రాగానే మాట మార్చారని, కాంగ్రెస్‌ను ముంచారని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విమర్శిస్తున్న సందర్భంలో కేసీఆర్ విషయంలో బీజేపీ అంత తేలికగా నమ్ముతుందా అనే ప్రశ్నకూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో నేరుగా పొత్తు పెట్టుకోవడం కంటే..లోపాయకారీగా అంశాల వారీగా మద్దతు ఇచ్చిపుచ్చుకోవడంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Must Read ;- టీఆర్ఎస్ కథ తేల్చేందుకు ‘త్రీ పాయింట్ ఫైట్’
బండి సంజయ్‌కి పిలుపు ఎందుకు..
వాస్తవానికి పది రోజల ముందే రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. డిసెంబరు 7న ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశాలు వచ్చాయని,ఈలోగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మార్పు అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచడం, కేసీఆర్ పర్యటనల నేపథ్యంలో బండి సంజయ్ మీటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసిన వెంటనే బండి సంజయ్‌కి పిలుపు రావడం చర్చకు కారణమైంది. వాటిలో ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా కారణమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్టేట్ ఇంటిలిజెన్స్‌తో పాటు సెంట్రల్ ఇంటిలిజెన్స్ కూడా నిఘా పెట్టింది. ఎంఐఎం- బండి సంజయ్ పరస్పర వ్యాఖ్యలతో జీహెచ్ఎంసీ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతోపాటు బీజేపీలోని కొందరు నాయకులు బండి సంజయ్ వ్యవహార శైలిపై పార్టీకి ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఫిర్యాదు అంశాలను బీజేపీ నాయకులు కొట్టి పడేస్తున్నారు.
ఇక ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పలువురు నాయకులు బీజేపీలో చేరుతున్నారు. వారిలో కొందరు టీఆర్ఎస్ నాయకులూ ఉన్నారు. వారి స్థాయి, వారికి ప్రజల్లో ఉన్న క్రేజ్ ఎంత..వాళ్లు ఇస్తున్న యాంటీ కేసీఆర్ సమాచారం ఎంత వరకు ఉపయోగపడుతుంది, మోడీ, అమిత్ షాలతో జరిగిన భేటీలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాల్లో పార్టీకి ఉపయోపడేవి ఏంటి..వాటిపై రానున్న కాలంలో పార్టీ పరంగా అమలు చేయాల్సిన వ్యూహాలేంటి అనే అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాల నేపథ్యంలో బండి సంజయ్‌కి ప్రమోషన్ వస్తుందని కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలోనూ బండి సంజయ్ ఢిల్లీ టూర్‌కి ప్రాధాన్యం పెరిగింది.
Also Read ;- ఢిల్లీకి కేసీఆర్ : ఎజెండా అదొక్కటేనా? ఇంకా ఉన్నాయా?