KCR Has Not Received Any Assurance From The Center On Grain Purchases :
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశానికి హాజరయ్యేందుకే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ఆ సమావేశానికి ముందు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఇక నక్సల్స్ రాష్ట్రాల సీఎంల భేటీ తర్వాత హోం మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ వెంటనే మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోనే కేసీఆర్ సుధీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపుగా గంటన్నరకు పైగా గోయల్ తో భేటీ అయిన కేసీఆర్.. తాజాగా సోమవారం కూడా మరోమారు ఇద్దరు కేంద్ర మంత్రులు అమిత్ షా, గోయల్ లతో భేటీ అయ్యారు. అయినా కూడా కేసీఆర్ తన ఢిల్లీ టూర్ ముగిసినట్టుగా భావించడం లేదు. ఎందుకంటే.. ఆయన కోరినట్లుగా ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదట.
మొత్తం ధాన్యం సేకరించాల్సిందే
తెలంగాణలో వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసేలా రైస్ మిల్లర్లు కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా వార్తలు వినిపించాయి కదా.. ఆ మేరకు కేంద్రం నుంచి హామీ వచ్చేలా కేసీఆర్ వ్యూహం రచించారట. ఇందులో భాగంగానే.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ అంటేనే.. కేసీఆర్ ఉత్సాహం చూపారు. ఈ నెలారంభంలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన కేసీఆర్.. మరోమారు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారంటేనే ఆసక్తి రేకెత్తించింది కదా. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు ఎవరూ లేరు కదా. అమిత్ షాతో భేటీ అనగానే.. ధాన్యం కొనుగోళ్లపై హామీ సంపాదించే వ్యూహాన్ని రచించుకున్న కేసీఆర్ ఢిల్లీ ఫ్లైటెక్కేశారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం ముగియగానే.. అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయిన కేసీఆర్.. ధాన్యం కొనుగోళ్లపై చర్చించారట. దీనిపై పీయూష్ తో మాట్లాడాలని అమిత్ షా సూచించడంతో అటు నుంచి అటే పీయూష్ వద్దకు కేసీఆర్ వెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ భేటీలో సుమారు గంటన్నరకు పైగా గోయల్ తో మాట్లాడిన కేసీఆర్… తెలంగాణ రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందేనని పట్టుబట్టారట.
గోయల్ నుంచి హామీ రాలేదు
ఆదివారం రాత్రి సుధీర్ఘంగా చర్చలు జరిపినా.. గోయల్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదట. అయినా కూడా కేసీఆర్ వెనక్కు తగ్గకపోవడంతో మళ్లీ రేపు చర్చిద్దాం అంటూ గోయల్ చెప్పారట. దీంతో రాత్రి బాగా పొద్దుపోవడంతో గోయల్ నివాసం నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. సోమవారం ఉదయమే మళ్లీ వస్తానంటూ గోయల్ కు సమాచారం పంపి.. ఆయన చెప్పిన సమయానికి అక్కడ వాలిపోయారట. అయితే కేసీఆర్ డిమాండ్ కు ఏ మేరకు న్యాయం చేయగలనన్న విషయంపై గోయల్ అధికారులతో చర్చించారట. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్లు, బియ్యం నిల్వలు తదితరాలపై సమగ్ర వివరాలు తెప్పించుకున్న గోయల్.. సోమవారం నాటి భేటీలో వాటిని కేసీఆర్ ముందు పెట్టారట. నాలుగేళ్ల వరకు సరిపడ బియ్యం నిల్వలు కేంద్రం వద్ద ఉన్నాయని, ఇలాంటి నేపథ్యంలో కొత్తగా ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని గోయల్ తేల్చి చెప్పారట. గోయల్ స్పందనతో షాక్ తిన్న కేసీఆర్.. ఎలాగైనా ధాన్యం కొనుగోళ్లపై హామీ తీసుకునే దిశగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారట. ఈ క్రమంలోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటన మరిన్ని రోజుల పాటు పొడిగించుకునే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జేసీ వస్తానంటే.. కేసీఆర్ ఒప్పుకుంటారా?