హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాల్సిందేనన్న కసితో కేసీఆర్ సర్కారు దళిత బంధు సహా పలు సంక్షేమ పథకాలను హుజూరాబాద్‌లో ప్రారంభించేసింది. నియోజకవర్గ పరిధిలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వేల కోట్ల మేర నిధులను విడుదల చేసింది. అయితే సరిగ్గా ఉప ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ముందరి కాళ్లకు బంధమేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే హుజూరాబాద్‌లో దళిత బంధుకు బ్రేకులు పడగా.. తాజాగా ఈ నెల 27న హుజూరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన కేసీఆర్ సభకు కూడా బ్రేకులు పడిపోయాయి.
ఎన్నికల కోడ్‌తో చిక్కులు
హుజూరాబాద్‌తో పాటు పలు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయా నియోజకవర్గాలు ఉన్న జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. ఫలితంగా భారీ సన సందోహంతో కూడిన బహిరంగ సభలకు ఎప్పుడో బ్రేకులు పడిపోయాయి. అదే సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందంటూ దళిత బంధును కూడా హుజూరాబాద్‌లో నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఎన్నికలు జరుగుతున్న జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తీసుకువస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా హుజూరాబాద్ ఉన్న కరీంనగర్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న వరంగల్ జిల్లాలోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టైంది. ఫలితంగా కేసీఆర్ వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ కూడా రద్దైపోవడం ఖాయమే. కేసీఆర్ సభతో పాటు అమిత్ షా పాల్గొననున్న సభకు కూడా ఈసీ బ్రేకులేసింది. ఒకవేళ సభలు నిర్వహించాలనుకుంటే.. 500 మందికి మించకుండా జనంతో సభలను నిర్వహించుకోవచ్చంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో కేసీఆర్ సభ దాదాపుగా రద్దైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ ప్లీనరీనే ప్రచార సభ
ఉప ఎన్నికల నేపథ్యంలో భారీ జన సందోహంతో నిర్వహించతలపెట్టిన సభలు రద్దు అయిపోవడంతో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యతలను భుజానికెత్తుకున్న ఆ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన సాగిస్తున్నా.. ఎందుకనో టీఆర్ఎస్కు విజయంపై భరోసా దక్కడం లేదు. ఫలితంగానే కేసీఆర్‌తో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ తలుస్తోంది. అయితే ఈ సభకు ఈసీ నుంచి బ్రేకులు పడిపోవడంతో త్వరలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ సమావేశాన్నే హుజూరాబాద్ ఎన్నికల ప్రచార సభగా మలచుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ ముందు ఈ ప్రత్యామ్నాయం మినహా మరేది లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి టీఆర్ఎస్ ఏ దిశగా అడుగులు వేస్తుందోనన్నది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టడం లేదు.