ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటే..‘మనం జన్మించిన భూమి స్వర్గం కంటే గొప్పది’ అని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన సూక్తిని మనం నివసిస్తున్న ప్రాంతం పట్ల అభిమానాన్ని పెంచుకొని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనందరం కృషి చేయాల్సిన అవసరమున్నదన్నారు. మనం నివసిస్తున్న ప్రాంతాన్ని కాలుష్యరహితంగా,పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి తెలంగాణ పౌరుడూ ప్రతిన బూనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
విజయవంతంగా హరితహారం
ధరిత్రీ రక్షణ చర్యల్లో భాగంగా తెలంగాణను పచ్చగా మార్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందని సీఎం తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. నేడు తెలంగాణ అంతటా జల లభ్యత పెరగడంతో పచ్చదనం పరిఢవిల్లుతోందన్నారు.
మనిషి స్వయంకృపరాధమే..
విశ్వవ్యాప్తంగా రోజు రోజుకూ జరుగుతున్న వాతావరణ మార్పులు, తద్వారా మానవ జాతికి కలుగుతున్న కీడు మనిషి స్వయంకృపరాధమనే విషయాన్ని అందరమూ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. కరోనా వంటి మహమ్మారీలతో ధరిత్రికి పొంచి ఉన్న ప్రమాదాలపై అవగాహన పెంచుకొని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధరిత్రి సంరక్షణకు మనం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తే..భవిష్యత్తు తరాలకు మనం అంత ఆనందం పంచినవాళ్లమౌతామని, గుణాత్మక జీవనాన్ని అందించిన వారమౌతామని సీఎం పేర్కొన్నారు.











