నిజమేనండోయ్.. కరీంనగర్ జిల్లాకు చెందిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ముగిసేదాకా తెలంగాణలో సంక్షేమ పథకాల జోరు ఆగేలా కనిపించడం లేదు. ఆది నుంచి టీఆర్ఎస్ లోనే సాగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కేసీఆర్ ఏకంగా తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన వైనం తెలిసిందే. దీంతో అహం దెబ్బతిన్నట్లుగా కనిపించిన ఈటల.. టీఆర్ఎస్ కు ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేరుగా వెళ్లి బీజేపీలో చేరిపోయారు. ఫలితంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు.. అసలు ఈసీ ఈ ఉప ఎన్నిక గురించి ఆలోచిస్తోందా? అన్నది కూడా4 తెలియదు. మొన్నటికి మొన్న ఉప ఎన్నికకు సిద్ధమేనా అంటూ కేసీఆర్ సర్కారుకు లేఖ రాసి ఆపై మౌనం పాటించింది. మొత్తంగా ఇప్పటికైతే ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదనే చెప్పాలి. అయితే ఈ ఎన్నికను ఎలాగైనా గెలవాల్సిందేన్న భావనతో సాగుతున్న టీఆర్ఎస్ సర్కారు అప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్ని సంక్షేమ పథకాలను మొదలెట్టేస్తోంది.
గీత కార్మికుల బంధు
ఇదివరకే దళితులను అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నడిపే దిశగా రూపొందించిన దళిత బంధుకు కేసీఆర్ సర్కారు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ప్రారంభించింది. అయితే ఈ పథకం వచ్చినంతనే మిగిలిన వర్గాలు కూడా తమకూ దళిత బంధు లాంటి పథకాలు కావాల్సిందేనని డిమాండ్ చేయడం మొదలెట్టాయి. ఆ దిశగానూ ఆలోచన చేసిన కేసీఆర్ సర్కారు.. ఇప్పుడు కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసమంటూ మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అయిపోయింది. ఈ పథకం కింద ప్రతి కల్లు గీత కార్మికుడికి ఓ మోపెడ్ (చిన్న బైక్) అందజేస్తారు. రూ.60 వేల ఖరీదు చేసే ఈ వాహనం కల్లు గీత కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల మంది కల్లు గీత కార్మికులున్నారు. వీరందరికీ మోపెడ్ లు అందించాలంటే.. ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఈ పథకాన్ని తొలుత 1,500 మంది కల్లు గీత కార్మికులకు అందజేయాలని నిర్ణయించిన కేసీఆర్.. అందుకోసం రూ.90 కోట్లను కేటాయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ లెక్క కూడా అక్కడిదేనా?
అయితే దళిత బంధు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఉండగా.. ఈ పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని 21,000 కుటుంబాలకు మాత్రమే వర్తింపజేయనున్నారు. హుజూరాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా ఈ పధకాన్ని అమలు చేస్తున్నారు. ఈ 21,000 కుటుంబాల్లోనూ తొలుత 5 వేల కుటుంబాలకే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. దళిత బంధు మాదిరిగానే.. ఇప్పుడు గీత కార్మికులకు అందజేయనున్న మోపెడ్ల పథకానికి కూడా పరిమిత సంఖ్యలోనే లబ్ధిదారులను ఎంపిక చేసిన వైనాన్ని చూస్తుంటే.. హుజూరాబాద్ పరిధిలో ఉన్న కల్లు గీత కార్మికుల సంఖ్యను ఆధారం చేసుకునే.. తొలుత 15,000 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని కేసీఆర్ అంచనా వేశారా? అన్న దిశగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. కేసీఆర్ నోరు తెరిస్తే చాలు హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపే వినిపిస్తోంది కదా. ఈ క్రమంలో ఏ పథకం చేపట్టినా కూడా ఆ ఉప ఎన్నికలో విజయాన్ని చేస్ చేసుకునే రూపొందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా. మరి ఈ పథకం కేసీఆర్ కు ఏ మేర ఉపయోగపడుతుందో చూడాలి.
Must Read ;- దళిత బంధు ఎదురు తన్నడం గ్యారెంటీ!