అత్యున్నత సాంకేతిక విలువలతో , భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలను నిర్మించే సంస్థగా హోంబలే ఫిలింస్జ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థను అలా తీర్చిదిద్దడంలో అధినేత విజయ్ కిరగందూర్ అభిరుచి అద్దంపడుతుంది. కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్‌తో ‘నినిందలే’, యష్‌తో ‘మాస్టర్ పీస్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అటుపిమ్మట పునీత్ రాజ్‌కుమార్ తో తీసిన ‘రాజకుమార’ చిత్రం హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక యష్‌తో తీసిన భారీ బడ్జెట్ తో తీసిన పాన్ ఇండియా చిత్రం ‘కె.జి.యఫ్ చాప్టర్1’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
ఈ క్రమంలో హోంబలే ఫిలింస్ మరో పాన్ ఇండియా చిత్రంగా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ ను రూపొందిస్తోంది. ఇదిలావుండగా.. తాజాగా హోంబలే ఫిలింస్ ఇంకో పాన్ ఇండియా సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, `‘ప్రస్తుతం మేము తీస్తున్న కె.జి.యఫ్ చాప్టర్ 2’పై ఏ స్థాయి అంచనాలున్నాయో అందరికీ తెలుసు. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఆ చిత్రం ఉంటుంది.
ఇక మా సంస్థలో తాజాగా మూడో పాన్ ఇండియా సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని భారతీయ భాషలలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం ఈ చిత్రం టైటిల్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను డిసెంబర్ 2,మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు తెలియజేస్తాం’’ అని చెప్పారు.