రెండు రోజులుగా ఖుష్బూపై తమిళనాట వివిధ పోలీస్ స్టేషన్లలో 70కి పైగా కేసులు నమోదు అయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఆమె మీద విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వదలిపెట్టినందుకు అనుకుంటే పొరబాటే. ఆ సందర్భంగా.. తన నిష్క్రమణను సమర్థించుకుంటూ.. ఖుష్బూ చేసిన కొన్ని వ్యాఖ్యలు జనాగ్రహానికి కారణం అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీనుంచి వెలుపలికి వచ్చిన సందర్భంగా ఖుష్బూ ‘‘మానసిక వికలాంగుల పార్టీ నుంచి తాను నిష్క్రమించా’’నని వ్యాఖ్యానించారు. ఖుష్బూ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరే సమయంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఖుష్బూపై మండిపడుతున్న దివ్యాంగులు..
ఈ వ్యాఖ్యలు తమను అవమానపరచేలా ఉన్నాయంటూ వివిధ పోలీస్ స్టేషన్లలో దివ్యాంగులు ఫిర్యాదులు చేస్తున్నారు. చెన్నై, కాంచీపురం, చెంగల్ పేట, మధురై, కోయంబత్తూరు, తిరువూర్ తదితర ప్రాంతాల్లోని పిఎస్ లలో కుష్బూపై ఫిర్యాదులు అందుతున్నాయి. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కూడా ఖుష్బూ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
కమలదళంలో చేరగానే..
సాధారణంగా ఒక పార్టీని వదలి మరో పార్టీకి వలస వెళ్లినప్పునడు.. పాత పార్టీ వారి వైపునుంచి ఆరోపణలు వెల్లువెత్తుతుంటాయి. విమర్శలు, దూషణలు కూడా తప్పవు. కానీ.. తమిళనాడు పరిస్థితి వేరు.. అక్కడ కాంగ్రెస్ కూడా అంత బలంగా ఉన్న పార్టీ కాదు. పార్టీకి ఉన్న ప్రజాదరణ పరంగా చూసుకుంటే.. కాంగ్రెస్‌కు, బీజేపీకి పెద్దగా తేడా ఏం లేదు. ఈ రెండింటిలో ఖుష్బూ కమలదళాన్ని ఎంచుకున్న తర్వాత.. ఆమెకు పాత పార్టీనుంచి పెద్దగా ఇబ్బంది రాలేదు.
కానీ ఆ సందర్భంగా నాలుకమీద అదుపులేకుండా మాట్లాడడమే ఇబ్బంది తెచ్చిపెట్టింది. వదిలిపెడుతున్న పార్టీపై బురద చల్లడం, అసమర్థ పార్టీగా అభివర్ణించడం మామూలే. కానీ.. ఈ అత్యుత్సాహంలో ఆ పార్టీని మానసిక వికలాంగుల పార్టీగా పేర్కొనడం.. ఆ వర్గాన్ని కించపరిచేలా ఉంది. అందుకే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆమె మీద పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి.
క్షమాపణ చెప్పక తప్పదా?
ఖుష్బూ చేరిక వల్ల తమిళనాట బీజేపీకి మేలు జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అనే మీమాంస వచ్చేలా.. ఈ పరిణామం తయారైంది.
అయితే ఇప్పుడు ఈ వివాదం రాజకీయానికి సంబంధించింది కాదు. ఖుష్బూ మీద విమర్శలు చేస్తున్న వాళ్లు మరో రాజకీయ పార్టీకి సంబంధించినది అయితే గనుక.. వాటిని తేలిగ్గా తీసుకోవచ్చు. కొట్టి పారేయవచ్చు. పట్టించుకోకుండా వదిలేయొచ్చు. కానీ.. ఇక్కడ పరిస్థితి అది కాదు. ఆమె మాటలు మానసిక వికలాంగులను నొప్పించేలా ఉన్నాయి. ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వాళ్లంతా వికలాంగులు. వీరి వాదనకు ప్రజల మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి.. పార్టీ నుంచి కూడా ఆమె మీద ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫిర్యాదుల విషయంలో ఖుష్బూ కూడా ఏదో ఒక మాట చెప్పి తప్పించుకోడానికి వీల్లేదు. అనివార్యంగా ఆమె మానసిక వికలాంగులకు క్షమాపణ చెప్పక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బేషరతుగా ఖుష్బూ వారికి క్షమాపణ చెబితే.. వివాదం ఇక్కడితో ముగిసిపోతుందని.. రాజకీయం భవిష్యత్తు మీద ఆశతో బీజేపీలో చేరిన ఆమెకు ముందుముందు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.











