ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే భారీ మోటార్స్ ప్లాంట్‌తో ఆటోమొబైల్ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న దిగ్గజ సంస్థ కియా మోటార్స్..రాష్ట్రంలో మరో భారీ విస్తరణకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్ల తయారీపై దృష్టి సారించిన కియా యాజమాన్యం..తమ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఏపీని మలిచేందుకు తీవ్ర ఆసక్తి చూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సానుకూల విధానాలు, పెట్టుబడుల ఆకర్షణ కోసం ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన కృషి సత్ఫలితాలను ఇస్తున్నాయి.
గతంలో సియోల్ వేదికగా కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హున్ లీ, ఇతర ఉన్నతస్థాయి ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ అత్యంత కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో ఏపీలో కియా కార్యకలాపాలను మరింత విస్తరించాలని, ప్రత్యేకించి ఇంటిగ్రేటెడ్ EV, హైబ్రిడ్ వాహనాల తయారీ హబ్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచి జరిగిన వరుస చర్చల నేపథ్యలో.. కియా సంస్థ ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుపై సానుకూల నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా భారీ ఎగుమతుల కేంద్రాన్ని నెలకొల్పే అంశం ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రపంచ మార్కెట్లకు EVలను ఎగుమతి చేసేందుకు వీలుగా..విశాఖ పోర్టు సమీపంలో కంప్లీట్లీ నాక్డ్ డౌన్ అసెంబ్లీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన పట్ల కియా ఆసక్తి చూపుతోంది. లాజిస్టిక్స్ పరంగా విశాఖ పోర్టు ఎంతో అనుకూలంగా ఉండటంతో, ఈ ప్రతిపాదన కియా గ్లోబల్ ఆపరేషన్స్‌కు ఎంతో కలిసిరానుంది.
కేవలం కార్ల అసెంబ్లీ మాత్రమే కాకుండా, ఈవీలకు అత్యంత కీలకమైన విడిభాగాల తయారీపైనా ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది. అత్యాధునిక E-GMP ప్లాట్‌ఫామ్ భాగాలు, బ్యాటరీ వ్యవస్థలు, ఇతర ఎలక్ట్రిక్ వాహన విడిభాగాల తయారీ కేంద్రాన్ని సైతం రాష్ట్రంలోనే నెలకొల్పే దిశగా కియాతో చర్చలు పురోగతిలో ఉన్నాయి. సంస్థ అనుకున్నట్లుగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే, దేశంలోనే అతిపెద్ద EV తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఏపీ అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.











