తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, జనసేన పోటీ చేసిన మొత్తం 8 స్థానాల్లో అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. అయితే తెలంగాణలో ఈ పొత్తుకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేసినట్లు.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కిషన్‌రెడ్డి ఎక్స్ ద్వారా స్వయంగా స్పందించారు.
‘‘అందరికీ నమస్కారం, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము.. జనసేనతో కలిసి బరిలో దిగాం. అయితే, ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాం’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
అయితే, అసలు విషయం బయటికి వచ్చింది. ఏపీలో టీడీపీ – జనసేన పొత్తులో నిప్పులు పోయడం కోసం వైఎస్ఆర్ సీపీ ఈ నాటకానికి తెరతీసింది. సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు వ్యాఖ్యలను ప్రచారం చేయడం ద్వారా.. ఏపీలో టీడీపీ – జనసేన బంధం బీటలు వారుతుందని ఆశించి ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టింది. అందులో భాగంగా ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్లుగా కొన్ని వ్యాఖ్యలను పుట్టించి.. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ల ద్వారా అదే పనిగా వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేయించింది. అంతేకాక, తన అనుకూల మీడియా వెబ్ సైట్లలో కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారం చేయించింది. ఆ ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా.. ‘‘పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని జీహెచ్ఎంసీ పరిధిలో నష్టపోయాం. అసలు పవన్ తో స్టేజ్ పంచుకున్నప్పుడే తెలంగాణ ప్రజలు మా విలువ తగ్గించారు. ఆ విషయం గమనించి పొత్తుని ఉప సంహరించుకోవాలని అధిష్ఠానం సూచించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పొయింది. మేం సొంతంగా పోటీ చేసి ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో 4 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశం ఉండేది. మేం మా కార్పొరేటర్లు చెప్పిన మాటలు విన్నా బాగుండేది’’ అంటూ అడ్డగోలుగా వైఎస్ఆర్ సీపీ ప్రచారం చేయించింది.
ఈ తప్పుడు ప్రచారం చేయడం ద్వారా పవన్ కల్యాణ్ సభలకు జనాలు రావడమే కానీ, ఫలితం ఉండదని వైఎస్ఆర్ సీపీ దుష్ప్రచారానికి ఒడిగట్టింది. జనసేనతో కలిసిన పార్టీ మరింత నష్టపోతుందనే భావనను కల్పించాలని ప్రయత్నించింది. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జనసేనపై అసహనం వ్యక్తం చేసినట్లుగా చెప్పిన మాటలతో సోషల్ మీడియాలో ప్రచారం చేయించింది. దీనికి సకల శాఖల మంత్రిగా పిలుచుకునే సజ్జల రామక్రిష్ణారెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి నాయకత్వం వహించినట్లుగా టాక్ నడుస్తోంది. తాజాగా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్న గుర్తించిన కిషన్ రెడ్డి సకాలంలో స్పందించడంతో వైసీపీ కుట్రకు అడ్డుకట్ట వేసినట్లు అయింది.