మంత్రి కొడాలి నానికి సొంత గ్రామంలోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. అక్కడ టీడీపీ బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. మంత్రి స్వగ్రామం గుడివాడ నియోజకవర్గం పామర్రు మండలం యలమర్రు గ్రామం. ఇక్కడ సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి కొల్లూరి అనూష 800 ఓట్లతో భారీ విజయం సాధించారు. దీంతో.. షాక్ తిన్న వైసీపీ శ్రేణులు.. డీలా పడిపోగా.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. తమ పార్టీ నేతలను మంత్రి కొడాలి నాని బూతులు తిట్టడాన్ని యలమర్రు గ్రామస్థులు జీర్ణించుకోలేకపోయారని, అందుకే వైసీపీ బలపర్చిన అభ్యర్థిని దారుణంగా ఓడించారని స్థానిక టీడీపీ నేతలు అంటున్నరు. ఈ విజయం చూసైనా కొడాలి.. తన తీరు మార్చుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
కొడాలికి హెచ్చరికా..!
మంత్రి కొడాలి స్వగ్రామంలో వైసీపీ ఘోర పరాజయం పాలవడం దేనికి సంకేతం? తాను గుడివాడకు శాశ్వత ఎమ్మెల్యేనంటూ విర్రవీగుతున్న నానికి సొంత జనాలే కర్రుకాల్చి వాత పెట్టారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితానికి ఇది సూచికా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి మంత్రి స్వగ్రామం ఆయనకు పెట్టని కోటలాంటిది. అలాంటి చోట తాను బలపర్చిన అభ్యర్థి ఓడిపోవడమే ఓ షాక్ అయితే.. 800 ఓట్ల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోవడం దిమ్మతిరిగేలా చేసింది. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లతో ఉన్న సాన్నిహిత్యం వల్ల.. నందమూరి అభిమానుల ఓట్లతో పాటు సంప్రదాయ తెలుగుదేశం ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోగలిగారు. అదే ఆయన ప్రధాన బలం. అందుకే అక్కడ తిరుగులేని నాయకుడిగా చలామణీ అవుతున్నారు. ఆ ఓటు బ్యాంకును ఆయన క్రమంగా కోల్పోతున్నట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఆయన నోటి దురుసుతనమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా జగన్.. తెలుగుదేశం శ్రేణులను అణచివేసే విధంగా వ్యవహరిస్తుండగా.. కొడాలి.. ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తూ.. చంద్రబాబును నీచమైన భాష వాడుతూ విమర్శిస్తున్నారు. దీనివల్ల స్థానికుల్లో నానిపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దీని ఫలితమే.. ప్రస్తుత పంచాయతీ రిజల్ట్ అని కొందరు వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇకనైనా ఆయన తీరు మారకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఆయనకూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు.
Must Read ;- తొగరాం పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా స్పీకర్ సతీమణి నామినేషన్