నవ్యాంధ్రప్రదేశ్ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో కోగంటి సత్యనారాయణ అంటే తెలియనివారు ఉంటారేమో గానీ.. కోగంటి సత్యం పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బెజవాడ బస్టాండ్ ను ఆనుకుని ఉన్న కృష్ణలంక కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తున్న కోగంటి సత్యంపై ఇప్పటికే లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. బెజవాడ పరిధిలోనే కోగంటి సత్యంపై ఏకంగా 30 కేసులకు పైగా నమోదయ్యాయట. పోలీసు రికార్డుల్లో ఆయన రౌడీ షీటర్గానే లెక్క. చూడటానికి సౌమ్యుడిగానే కనిపించే కోగంటి సత్యం ప్రస్థానంలో మకరలు తప్పించి మెరుపులు లేవన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొన్నామధ్య హైదరాబాద్ లో గుడికి వెళ్లి తిరిగి వస్తున్న రాంప్రసాద్ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య కోగంటి సత్యమే చేయించారని పోలీసులు తేల్చి కేసు కూడా నమోదు చేసిన వైనం తెలిసిందే.
కంపెనీ అమ్మనందుకేనా?
మూడు రోజుల క్రితం విజయవాడలో ఓ హత్య జరిగింది. కరణం రాహుల్ అనే యువకుడిని కారులో కూర్చోబెట్టి ముఖంపై దిండుపెట్టి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని యువ పారిశ్రామికవేత్త రాహుల్ గా గుర్తించారు. కోరాడ విజయ్ కుమార్ అనే వ్యక్తితో లావాదేవీల కారణంగానే ఆయన హత్యకు గురయ్యారన్న వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈ హత్య వెనుక కోగంటి సత్యం హస్తం ఉందన్న ఆరోపణలు కలకలం రేపాయి. అయితే ఈ హత్యతో తనకేమీ సంబంధం లేదని కోగంటి సత్యం ప్రకటించారు. అయితే పోలీసులు తీగ లాగితే డొంక మొత్తం కదిలింది. రాహుల్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న జిక్సిన్ సిలిండర్ల కంపెనీని చేజిక్కించుకునే క్రమంలో రాహుల్ తో కోగంటి సత్యం మంతనాలు జరిపారట. అయితే సత్యం చెప్పిన ధర చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో కంపెనీని విక్రయించేందుకు రాహుల్ అంగీకరించలేదట. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ ను రంగంలోకి దించిన సత్యం.. ఎలాగైనా ఆ కంపెనీని చేజిక్కించుకునేందుకు యత్నించారట. ఇందులో భాగంగా రాహుల్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఇద్దరు మహిళలతో కలిసి రాహుల్ ను విజయ్ కారులోనే అంతమొందించాడట.
ఏ2గా కోగంటి పేరు
ఈ కేసులో పూర్తి వివరాలను సేకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఏ1గా విజయ్ కుమార్ ను పేర్కొన్న పోలీసులు.. ఏ2గా కోగంటి సత్యం పేరును చేర్చారు. ఇక ఆ తర్వాత ముగ్గురు నిందితులుగా పద్మజ, పద్మజ, గాయత్రి అనే మహిళలను చేర్చారు. ఈ కేసులో ఏ3, ఏ4గా ఉన్న మహిళల ఇద్దరి పేర్లు పద్మజనే కావడం గమనార్హం. హత్య జరిగిన సమయంలో కారులో విజయ్ తో పాటు గాయత్రి అనే మహిళ కూడా ఉందని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య జరిగిన మరుక్షణమే విజయ్ తో పాటు గాయత్రి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందట. ఇకే పేరు కలిగిన పద్మజ అనే మహిళలు కూడా పరారీలోనే ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ హత్యతో తనకేమాత్రం సంబంధం లేదని చెబుతున్న కోగంటి సత్యంను పోలీసులు అదుపులోకి ఎప్పుడు తీసుకుంటారోనన్న చర్చ ఆసక్తి రేకెత్తిస్తోంది.