కోకాపేట.. ఈ పేరు వింటేనే.. హైదరాబాద్ పరిధిలోని అత్యంత విలువైన భూములు ఉన్న ప్రాంతం గుర్తుకు వచ్చేంది. అయితే ఇదంతా నిన్నటి మాట. ఇకపై ఈ ప్రాంతంపై ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యే పరిస్థితి లేదనే చెప్పాలి. గురువారం కోకాపేటలోని 50 ఎకరాల మేర ప్రభుత్వ భూముల వేలమే ఈ తరహా భావనను కలిగించిందని చెప్పక తప్పదు. ప్రభుత్వం కోట్ చేసిన కనీస విలువకు మించి ఒక్కటంటే.. ఒక్క కోటి రూపాయల అదనపు ధర కూడా ఈ భూములకు పలకలేదు. ఒకటీ, అరా ఎకరాలు రూ.60 కోట్లకు అమ్ముడుబోయినా.. మెజారిటీ ఎకరాలు ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధర రూ.40 కోట్లు కూడా పలకలేదు. నిజమా? అంటే.. గురువారం నాటి వేలాన్ని పరిశీలిస్తే ఈ భావన నిజమేనని నమ్మక తప్పదు.
మెజారిటీ బిట్లు తక్కువ ధరకే..
కోకాపేటలోని 49.94 ఎకరాలను వేలం వేసేందుకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా గతంలో ఇక్కడి భూములకు పలికిన భారీ ధరలను దృష్టిలో పెట్టుకుని ఎకరం కనీస ధరను రూ.40 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడైనా డిమాండ్ ఉంటే.. కనీస బిడ్ విలువను మించి బిడ్లర్లు అధిక ధరలను కోట్ చేస్తారు. అయితే కోకాపేటకు సంబంధించి తాజాగా జరిగిన వేలంలో ప్రభుత్వం ప్రకటించిన కనీస ధర కంటే తక్కువకే కోట్ చేసిన బిడ్లర్లు చాలా చౌకగానే ఈ భూములను దక్కించుకున్నారు. మొత్తం 49.94 ఎకరాలను వేలం వేస్తే.. 1.65 ఎకరాల బిట్ మాత్రం ఎకరాకు రూ.60.2 కోట్ల మేర రికార్డు ధర పలికింది.ఇక మిగిలిన 7 బిట్లలో కేవలం రెండు బిట్లు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన కనీస ధర కంటే కాస్తంత ఎక్కువగా ఎకరం రూ.42 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక మిగిలిన 5 బిట్లు కనీస ధర కంటే చాలా తక్కువకే అమ్ముడయ్యాయి. ఓ బిట్ అయితే ఏకంగా రూ.31 కోట్లకు అమ్ముడుబోవడం గమనార్హం.
50 ఎకరాలకు రూ.2 వేల కోట్లు..
మొత్తం 49.94 ఎకరాల భూమిని 8 బిట్లుగా విభజించి వేలం పెట్టగా.. వీటిలో మూడు బిట్లు మాత్రమే ప్రభుత్వం ఆశించిన ధర కంటే అధిక ధరలకు అమ్ముడయ్యాయి. మెజారిటీ 5 బిట్లు నిర్ధారిత రేట్ల కంటే కూడా తక్కువకే వెళ్లిపోయాయి. మొత్తంగా ప్రభుత్వం ఆశించిన ఎకరా రూ.40 కోట్ల మేర రేటు అయితే దక్కిందనే చెప్పాలి. సగటున ఎకరా భూమి రూ.40.05 కోట్లకు అమ్ముడుబోయింది. అంటే సర్కారీ ఖజానాకు ఈ భూముల వేలం ద్వారా నికరంగా రూ.2 వేల కోట్లైతే వచ్చిందనే చెప్పాలి. అయితే గతంలో ప్రభుత్వం కనీస ధరను రూ.30 కోట్లుగా ప్రకటిస్తే.. బిడ్డర్లు మాత్రం ఎకరాను రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే.. ప్రభుత్వం ఆశించిన దానికంటే 25 శాతం మేర అధిక ధరలు పలికాయన్న మాట. మరి ఆ వేలంతో పోల్చి ప్రస్తుత వేలాన్ని చూస్తే.. కోకాపేట భూములపై బిడ్డర్లకు ఆసక్తి తగ్గినట్టే కదా. అంటే.. కోకాపేట ఇకపై కాసుల పేట ఎంతమాత్రం కాదనే అర్థం కదా.
Must Read ;- రేవంత్ దూకుడు.. టీఆర్ఎస్ కు ముచ్చెమటలు!