తెలుగులో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా అవతరించిన ‘ఆహా’ ఇటు ప్రేక్షకుల మనసును .. అటు ఇండస్ట్రీ మనసును గెలుచుకుంటోంది. అలా తన స్థాయిని .. మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతోంది. ‘ఆహా’లో తమ సినిమాను రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు బలంగా చెప్పగలిగే స్థాయికి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్లాట్ ఫామ్ పైకి చేరుకోవడానికి చాలా సినిమాలు ‘క్యూ’ కడుతున్నాయి. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా ‘ఆహా’ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి ఆసక్తిని చూపుతున్నాయి. అలా త్వరలో ‘ఆహా’లో ‘క్రాక్’ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
కొన్ని సినిమాలు విడుదలకి ముందే డిజిటల్ డీలింగ్స్ జరిగిపోతుంటాయి. ఫలానా రోజున ఆ సినిమాను స్ట్రీమింగ్ చేస్తామనే ఒప్పందం ముందుగానే జరిగిపోతుంది. ఆ తరువాత ఆ సినిమా థియేటర్స్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతూ, కలెక్షన్లను కుమ్మేస్తున్నా ఆ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నిర్వాకులకు దానితో సంబంధం లేదు. ముందుగా జరిగిన అగ్రిమెంట్ ప్రకారం, తమ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఆ సినిమాను స్ట్రీమింగ్ చేసేస్తారు. అలా చేయడం వలన థియేటర్స్ ద్వారా లభించే వసూళ్లు తగ్గిపోతాయి. దానితో కూడా సదరు ఓటీటీ నిర్వాహకులకు సంబంధం ఉండదు.
కానీ తెలుగు ఓటీటీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ‘ఆహా‘ అలా వ్యవహరించకపోవడం ఇప్పుడు అందరి మన్ననలను అందుకుంటోంది. ‘క్రాక్’ సినిమా విడుదలకి ముందుగానే ‘ఆహా’ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ అని ప్రకటించింది కూడా. తరువాత ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని, ఇంకా మంచి కలెక్షన్లతో పరుగులు తీస్తోంది. దాంతో థియేటర్ల సంఖ్య కూడా పెంచారు. ఈ సమయంలో ‘ఆహా’వారు మంచి మనసుతో వ్యవహరించి, అగ్రిమెంట్ తో సంబంధం లేకుండా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ను వారం రోజులపాటు వాయిదా వేశారు. అందువల్ల ఒక వారం ఆలస్యంగా .. అంటే, ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ‘ఆహా’లో ఈ సినిమా స్ట్రీమింగ్ జరగనుంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ టైటిల్ కి తగినట్టుగానే వ్యవహరించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Must Read ;- క్రాక్ కోసం ఉత్సాహం చూపుతున్న థియేటర్లు