కృష్ణాబోర్డు కార్యాలయం విశాఖకు తరలిస్తున్నారనే సమాచారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో చాలా మంది నిపుణులు, రైతు సంఘాలు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, వీటిని పరిష్కరించడానికి బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి నీరు కూడా ప్రధాన కారణం కావడంతో, భవిష్యత్తులో మరిన్ని సమస్యలు రాకుండా కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణ, నీటి పంపిణీ చేసేందుకు రాష్ట్ర విభజనకు ముందే అప్పటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నదీజలాల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని గత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కృష్ణా బోర్డును హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించడానికి ఏడేళ్లు ఎందుకు పట్టిందో ఎవరికీ అర్థం కాదు.
తాజాగా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును విశాఖకు తరలించాలని కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాసింది. దానికి వారు కూడా అంగీకరించారు. అసలు కృష్ణా జలాలతో సంబంధం లేని విశాఖలో బోర్డు కార్యాలయాన్ని పెట్టడంపై రైతు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా బోర్డును విజయవాడలో పెట్టాలని తాము మొదటి నుంచీ పోరాడుతున్నామని వారు చెబుతున్నారు. కృష్ణా బోర్డు పెడితే జలాలు వినియోగించుకునే రాయలసీమలో లేదంటే విజయవాడలో ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయడం, వారు అంగీకరించడం జరిగిపోయాయి. కృష్ణా జలాల యాజమాన్య బోర్డును విశాఖకు తరలించడం వెనుక కుట్ర సాగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విశాఖలో కృష్ణా బోర్డు పెట్టడం వెనుక వ్యూహమేంటి?
ఈ ఏడాది ఉగాది నాటికి విశాఖ నుంచి పరిపాలన సాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేఆర్ఎంబీ ని కూడా విశాఖలో ఏర్పాటు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నాలుగో అంతస్థులో ఆర్టీసీ పరిపాలన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అన్ని పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలుస్తోంది. అమరావతి రాజధానిపై తీర్పు రావడమే ఆలస్యం వెంటనే కార్యాలయాలు విశాఖ తరలించేందుకు సిద్ధంగా ఉండాలని, విశాఖలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. విశాఖ వెళ్లడానికి సచివాలయ సిబ్బంది సిద్దంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించడం కూడా ఈ సంకేతాలకు బలం చేకూరుస్తోంది.
విజయవాడ, వెలగపూడి, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో కొనసాగుతున్న 120కు పైగా ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఏప్రిల్ 13 తరవాత విశాఖ తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఎలాగూ రాజధానిని విశాఖకు తరలిస్తాం, కాబట్టి కేఆర్ఎంబీ విజయవాడలో పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బోర్డు మీటింగ్ లకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి బోర్డు రాజధానిలో ఉంటే సౌకర్యంగా ఉంటుందనే వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. అయితే అసలు జలాలతో సంబంధం లేని ప్రాంతంలో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయడం వెనుక అసలైన ఉద్దేశం ఇదేనని స్పష్టం అవుతోంది.
విశాఖలో బోర్డు పెడితే ఎలా నష్టం?
కృష్ణా జలాల యాజమాన్య బోర్డును విజయవాడలో కాని, కర్నూలులో కాని పెడితే ప్రయోజనకరంగా ఉంటుందని రైతు సంఘాల నాయకులు వాదిస్తున్నారు. కృష్ణా జలాలను వినియోగించుకునేది ముఖ్యంగా రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లా రైతులు కాబట్టి ఈ ప్రాంతంలో బోర్డు పెడితే వారి సమస్యలు కూడా బోర్డుకు విన్నవించడానికి అనువుగా ఉంటుందనే వాదనను వారు వినిపిస్తున్నారు. మరో వైపు బోర్డు సమావేశాలకు తెలంగాణ అధికారులు కూడా తరచూ హాజరు కావాల్సి ఉంటుంది. విజయవాడలో బోర్డు ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరు కావడానికి అనువుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ప్రధానంగా జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు ప్రధానమైనవి. ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు ఏ పంటకు ఎంత నీరు కావాలో రైతులు, రైతుసంఘాల నేతలు వినతి పత్రాలు ఇవ్వాలన్నా విజయవాడ అనుకూలంగా ఉంటుంది. ఎక్కడో శ్రీశైలం ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు కావాలని రైతులు అడగాలంటే విశాఖ వెళ్లి బోర్డు అధికారులకు వినతిపత్రం ఇవ్వడం కూడా కష్టమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ కృష్ణా బోర్డు హైదరాబాద్ లో ఉండటం వల్ల నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు సకాలంలో నీరు విడుదల చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదే బోర్డు విజయవాడలో ఉంటే రైతులు వారికి సమస్య వచ్చినప్పుడు బోర్డు అధికారులకు చెప్పుకోవడానికి వీలు దొరుకుతుంది. తద్వారా ఆయకట్టుకు సకాలంలో నీరు విడుదల అయ్యే అవకాశాలు ఉంటాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.
నీటి కొలతలే ప్రధాన సమస్య
కృష్ణా బోర్డు ఏ రాష్ట్రానికి ఎంత జలాలు అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఆయా ప్రాజెక్టుల్లో పనిచేసే అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వింటారు కానీ, బోర్డు ఆదేశాలు పట్టించుకోవడం లేదు. దీంతో మీరు ఎక్కువ జలాలు వాడుకున్నారంటే, మీరెక్కువ నీరు వాడేసుకున్నారనే విమర్శలు ఏటా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఎత్తిపోతల పథకాల నుంచి ఎంత నీరు ఎత్తిపోసి వాడుకున్నారో తెలిపే లెక్కలు కూడా అందుబాటులో ఉండటం లేదు. కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ ఎత్తి పోతల పథకాల ద్వారా ఏ రాష్ట్రం ఎంత నీరు వాడుకుందో బోర్డు వద్ద ఇప్పటికీ సరైన గణాంకాలు లేవు. బోర్డు కేవలం ఆదేశాలు జారీ చేయడం వరకే పరిమితం అవుతోంది.
ప్రాజెక్టులు నిర్వహించే సిబ్బంది వారి పరిధిలో ఉండరు. బోర్డు చెప్పిన ఆదేశాలు అధికారులు పాటిస్తున్నారా లేదా? అనేది కూడా వారికి తెలియడం లేదు. అందుబాటులో ఉన్న జలాల్లో ఏ రాష్ట్రానికి ఎంత అని చెప్పడం వరకే బోర్డు పరిమితం అవుతోంది. ఇక ప్రాజెక్టు ఏ రాష్ట్రం పరిధిలో ఉంటే వారు చెప్పిందే వేదం. ఇలాంటి పరిస్థితుల్లో కేఆర్ఎంబీని విశాఖలో ఏర్పాటు చేస్తే కృష్ణా జలాలపై ఆధారపడ్డ రైతాంగానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. కృష్ణా జలాలను వాడుకునే ప్రాంతాల్లోని నగరాలైన విజయవాడ లేదా కర్నూలులో బోర్డు ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.