ఏపీ తెలంగాణల మధ్య జలవివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రాజెక్టుల ప్రతిపాదనలు, అనుమతులు తీసుకునే సమయంలో చేస్తున్న రచ్చకంటే ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్న సమయంలో ఎక్కువ రచ్చ జరుగుతుండడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ ఏపీలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంపై మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు చేసినట్టు వార్తలు వచ్చాయి. మూడు రోజుల క్రితం ‘లంకలో పుట్టినవాళ్లు అందరూ రాక్షసులే. ఆంధ్రావాళ్లు ఎన్నడూ తెలంగాణ మేలు కోరరు. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలి’ అని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఏపీలో అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
గొడవలు పడితే లాభం లేదంటూ..
ఇదంతా ఒక ఎత్తైతే గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలు చాలా సన్నిహితంగా వ్యవహరించారు. ఇద్దరూ చంద్రబాబును ఉమ్మడి శత్రువుగానే వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విషయంలో కొన్నిసార్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉదారంగా వ్యవహరించారు. గొడవలు పడితే లాభం ఉండదని, సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకోవాలని ఉపదేశించారు. మరి అలాంటిది ఇప్పుడు ప్రాంతీయ వైషమ్యాలు మరోసారి తెరపైకి రావడానికి కారణాలేంటి అనే సందేహాలూ వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఈటల ఎపిసోడ్, హుజూరాబాద్ ఉప ఎన్నిక, వైఎస్ షర్మిల కొత్త పార్టీ తదితర అంశాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలు, ప్రతివిమర్శలకు ప్రాధాన్యం ఏర్పడింది.
Must Read ;- పోలవరం పరిహారాన్ని దోచుకుతింటున్నారు : పట్టాభి
తెలంగాణపై ఏపీ..
శ్రీశైలం ఎగువన తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి 90 టీఎంసీలు, దిండి 30 టీఎంసీలు, మిషన్ భగీరథ 19.59 టీఎంసీలు, భక్త రామదాసు 5.50 టీఎంసీలు, తుమ్మిళ్ల 5.44 టీఎంసీలు ఇలా మొత్తం 150 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులను రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ నిర్మిస్తోందని ఆరోపిస్తోంది. వీటితో పాటు ఇప్పటికే ఉన్న ఎస్‌ఎల్‌బీసీ 40 టీఎంసీలు, కల్వకుర్తి 40 టీఎంసీలు, నెట్టెంపాడు 25.40 టీఎంసీలు మొత్తంగా 105 టీఎంసీలకు విస్తరించి మొత్తం 255 టీఎంసీల నీటిని తరలిస్తోందని ఆరోపిస్తోంది. ఇదే విధానం కొనసాగితే వర్షాభావం తలెత్తిన పరిస్థితుల్లో శ్రీశైలం కుడి కాలువ కింద ఏపీ పరిధిలో ఉన్న 2 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ కింద ఉన్న 15 లక్షల ఎకరాలు, ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న 13 లక్షల ఎకరాలు కలిపి మొత్తంగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారుతుందని కూడా ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వారం క్రితం కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలుగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిపై జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో జోగులాంబ బ్యారేజీని నిర్మించి 60-70 టీఎంసీల నీటిని తరలించాలని, ఆ నీటిని పాలమూరు-రంగారెడ్డి పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి.. పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు అందించాలని నిర్ణయించింది.
ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ
ఇక ఏపీలో నిర్మితం అవుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కూడా పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలపై నిరసన తెలిపింది. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం పలు పోరాటాలు చేస్తోందని, అయితే కొన్ని ప్రాజెక్టులు ఆపాలని కేంద్రం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ( ఎన్జీటీ ) ఆదేశాలనూ ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా 29 టీఎంసీలు, ఎస్ఆర్బీసీ 19 టీఎంసీలు, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా 38 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవడానికి అవకాశం ఉందని, ఆ నీటిని తరలించుకోవడానికే రాయలసీమ లిఫ్ట్ అని చెబుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వం కొన్ని విషయాలు దాచి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టిందని, రూ.3,307 కోట్లతో జరుగుతున్న ఈ పనులను 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
Must Read ;- కేసీఆర్ కామెంట్!.. వైఎస్సార్ ను మించిన మూర్ఖుడు జగన్